Begin typing your search above and press return to search.

నాన్ స్టాప్ వ‌ర్షాల‌తో మునిగిన‌ ముంబ‌యి

By:  Tupaki Desk   |   21 Sep 2017 4:40 AM GMT
నాన్ స్టాప్ వ‌ర్షాల‌తో మునిగిన‌ ముంబ‌యి
X
దేశ ఆర్థిక రాజ‌ధాని మునిగిపోయింది. విడిచి పెట్ట‌కుండా కురుస్తున్న కుండ‌పోత వాన‌కు ముంబ‌యి వాసులు ఇప్పుడు వ‌ణికిపోతున్నారు. మొన్న‌టికి మొన్న భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన ముంబ‌యి మ‌రోసారి భారీ వ‌ర్షంతో అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. నిన్న (బుధ‌వారం) ఒక్క రోజులో 12 గంట‌ల వ్య‌వ‌ధిలో 9 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల నుంచి మూడు గంట‌ల ప‌దిహ‌నే నిమిషాల వ్య‌వ‌ధిలో అంటే.. పావు గంట (15 నిమిషాలు) వ్య‌వ‌ధిలో నాలుగు సెంటీమీట‌ర్ల కుండ‌పోత వాన ముంబ‌యిని ముట్ట‌డించేసింది.

దీంతో ముంబ‌యికి జ‌ల‌ప్ర‌ళ‌యం ముప్పు పొంచి ఉన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. ఈ వ‌ర్షం ఇక్క‌డితో ఆగ‌ద‌ని.. మ‌రో 72 గంట‌ల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ చేస్తున్న హెచ్చ‌రిక‌లు ముంబ‌యి వాసుల‌కు ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి.

వ‌ర్షాల కార‌ణంగా ముంబ‌యిలో ల్యాండ్ కావాల్సిన విమానాల్ని హైద‌రాబాద్ తో స‌హా ప‌లు న‌గ‌రాల‌కు త‌ర‌లించారు. ముంబ‌యి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ప్ర‌ధాన ర‌న్ వేను తాత్కాలికంగా మూసేశారు. రెండో ర‌న్ వే మాత్ర‌మే ఇప్పుడు ప‌ని చేస్తోంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా 183 విమానాల్ని ర‌ద్దు చేయ‌గా.. 51 విమానాల‌ను దారి మ‌ళ్లించారు. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల్లో ముంబ‌యికి రావాల్సిన ప్ర‌యాణికుల్ని శంషాబాద్ కు త‌ర‌లించి.. అక్క‌డి హోట‌ళ్ల‌లో బ‌స ఏర్పాటు చేశారు.

విడ‌వ‌కుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా స్కూళ్లు.. కాలేజీల‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించారు. వ‌ర్షం కార‌ణంగా ల‌క్ష‌లాదిమంది తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతుంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ పాడు వాన‌ల‌తో ఐదుగురు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.

వాతావ‌ర‌ణ ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేక‌పోవ‌టంతో ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. ముంబ‌యి ప్ర‌జార‌వాణాలో కీల‌క‌మైన స‌బ‌ర్బ‌న్ రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌టంతో త‌మ సేవ‌ల్ని నిలిపివేస్తున్న‌ట్లు డ‌బ్బావాలాలు ప్ర‌క‌టించారు. మొత్తంగా చూస్తే ముంబ‌యి ప్ర‌జ‌లు వ‌రుణుడి దెబ్బ‌కు వ‌ణికిపోతున్నారు.