Begin typing your search above and press return to search.

వందేళ్ల తర్వాత.. చెన్నై మునిగిపోయింది

By:  Tupaki Desk   |   2 Dec 2015 5:09 AM GMT
వందేళ్ల తర్వాత.. చెన్నై మునిగిపోయింది
X
చెన్నైలో తాజా పరిస్థితి ఏమిటి? అక్కడి వర్షం తీవ్రత ఏ స్థాయిలో ఉంది? అన్న ప్రశ్నకు రెండు.. మూడు ఉదాహరణలో అక్కడ ఎంత దారుణ పరిస్థితి నెలకొందో చెప్పేయొచ్చు. చెన్నై మీనంభాకం విమానాశ్రయం మునిగిపోయింది. ఎయిర్ పోర్ట్ ని మూసేశారు. రోడ్ల మీద అరు అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి. కార్లు.. బైకులు నీళ్లల్లో తేలుతున్నాయి. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షంతో చెన్నై మహానగరంలో మూడు వంతులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. చెన్నైలోని సముద్రాన్ని తలపించేలా చెన్నై వీధులు తయారయ్యాయి.

ఇక.. చెన్నై శివారు ప్రాంతాల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. స్కూళ్లు.. ఆఫీసులకు సెలవులు ఇచ్చేయటంతో పాటు.. విమాన.. రైళ్ల సర్వీసుల్ని నిలిపివేశారు. మొత్తంగా చన్నై మహా నగరం స్తంభించిపోయింది. చెన్నైవాసి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేక.. అలా అని ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇళ్లల్లోకి వచ్చేసి నీటితో పై అంతస్తుల్లో ఉంటూ బిక్కుబిక్కుమంటున్న దుస్థితి. తాజా అంచనాల ప్రకారం మరో వారం రోజులు ఇలాంటి దారుణ పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

వర్ష బీభత్సం కారణంగా ఇప్పటివరకూ 188 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర ప్రాంతాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజా రక్షణ కోసం నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఆదేశించింది. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కురుస్తున్న వర్షంతో వందేళ్ల నాటి రికార్డు బద్ధలైంది. చెన్నై మహానగరిలో 1918 నవంబరులో 108.8 సెంటీమీటర్ల వర్షం (ఒక్క రోజులో) కురిసి అప్పట్లో చెన్నై నగరి మునిగిపోతే.. తాజాగా ఆ రికార్డు బద్ధలై.. ఒక్కరోజులో 119.7 (అంటే.. 120 సెంటీమీటర్లుగా చెప్పొచ్చు) సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెన్నైలో వర్షం.. చిరపుంజిని తలపిస్తోంది. భారీ వర్షాలతో పాటు.. పెద్ద ఎత్తున వీస్తున్న గాలులు వీస్తుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. చెన్నైలోని విమానాశ్రయాన్నితాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రన్ వే జలశయాన్ని తలపించేలా ఉంటే.. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో దాదాపుగా 400 పైగా చిక్కుకుపోయారు.