Begin typing your search above and press return to search.

శ్రీశైలం తిరుమలైంది.. తిరుమల శ్రీశైలమైంది..

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:34 AM GMT
శ్రీశైలం తిరుమలైంది.. తిరుమల శ్రీశైలమైంది..
X
తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోవాలంటే ప్రత్యేక దర్శనాలైనా సరే ఎక్కువ సమయమే పడుతుంది. ఇక సాధారణ దర్శనాలైలే ఒక్కోసారి పది పదిహేను గంటలు కూడా పడుతుంది. ఏడాదంతా ఇలాగే ఉంటుంది. కానీ, శ్రీశైలంలో అలాంటి పరిస్థితి ఉండదు. రద్దీ ఉన్న ఆలయమే అయినా తిరుమలతో పోల్చితే అది చాలా తక్కువ. ఎంత బిజీ సీజనైనా రెండు గంటలకు మించి సమయం పట్టదు. కానీ... కొద్ది రోజులుగా పరిస్థితి తారుమారైంది.. తమిళనాడు - నెల్లూరు - చిత్తూరు - రాయలసీమల్లో భారీ వర్షాల కారణంగా తిరుమలలో రద్దీ తగ్గగా, కార్తీక మాసం కారణంగా శ్రీశైలంలో రద్దీ బాగా పెరిగింది. అందులోనూ కార్తీక పౌర్ణమి నేపథ్యంలో బుధవారం రద్దీ విపరీతంగా ఉంది.

సుమారు 10 రోజుల పాటు వర్షాలు బీభత్సం సృష్టించడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. ఒకట్రెండు రోజులైతే ఎన్నడూ లేనంతగా పావు గంటలోనే దర్శనమైపోయింది. ప్రస్తుతం సర్వ దర్శనానికి కూడా గంటన్నరకు మించి సమయం పట్టడం లేదు. అదే శ్రీశైలంలో మాత్రం ధర్మదర్శనానికి కనీసం ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనమైనా నాలుగు గంటలకు తగ్గడం లేదు.

అయితే.. వర్షాలు తగ్గడం.. కార్తీక పూర్ణిమ బుధవారంతో ముగియనుండడంతో మళ్లీ తిరుమలకు తాకిడి పెరుగుతుందని చెబుతున్నారు. దక్షిణాంధ్ర - చెన్నైలలో రహదారి వ్యవస్థ - రైళ్ల వ్యవస్థ పూర్తిగా గాడిన పడితే తిరుమలకు మునుపటి కళ వచ్చేస్తుంది. కాగా శ్రీశైల మల్లికార్జునుడికీ భక్తుల తాకిడి పెరగడంపై హర్షం వ్యక్తమవుతోంది.