Begin typing your search above and press return to search.

రేవంత్ కు టికెటా.? సిల్లీ మాట..

By:  Tupaki Desk   |   17 Dec 2018 10:12 AM GMT
రేవంత్ కు టికెటా.? సిల్లీ మాట..
X
తొడగొట్టిన ఆయన్ను టీఆర్ఎస్ శ్రేణులు పడగొట్టారు. బండ బూతుల పర్వానికి ప్రజలు ఓటు తో బుద్ది చెప్పారు. కారు కు సర్కారును ఇచ్చారు. ఓటమి భారంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి మౌనం దాల్చారు. ప్రజాతీర్పు కు ఆయన జనబాహుల్యంలోకే రావడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో బీరాలకు పోయి కేసీఆర్- కేటీఆర్ ను టార్గెట్ చేసి పోరాడిన రేవంత్ రెడ్డి చిత్తుగా ఓడి ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అన్నింటికంటే మించిన ప్రజాతీర్పును చూసి ఇప్పుడు మిన్నకుండిపోయారు.

కొడంగల్ లో తనను ఓడించే మగాడెవ్వడు లేడంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన శపథాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నాడో లేదో కానీ టీఆర్ఎస్ ముఖ్యులు మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు. అన్నట్టుగానే రేవంత్ ను ఓడించారు. దీంతో మానసికంగా దెబ్బతిన్న రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పట్లో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేలా కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ అధిష్టానం ఓడిన రేవంత్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు మచ్చుకైనా కనిపించడం లేదు. జైపాల్ రెడ్డి లాంటి సీనియర్లు మహబూబ్ నగర్ బరిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి దూకుడు వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందన్న విమర్శల మధ్య మళ్లీ ఆయనకు టికెట్ దక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కానీ కొందరు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆయన పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతున్నారని.. మహబూబ్ నగర్ ఎంపీ గా బరిలోకి దిగుతారని ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి కీలక కార్యకర్తలు పోటెత్తుతున్నారట.. నియోజకవర్గం పై సరిగా దృష్టి సారించక రాష్ట్రవ్యాప్తంగా తిరిగి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని.. ఈసారి ఎంపీ గా పోటీచేసేందుకు పూర్తిస్థాయి లో దృష్టి పెట్టాలని రేవంత్ ను కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రజాభిప్రాయానికి మధ్య కేవలం 5 నెలల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 2018 కు మే 2019కు మధ్య స్వల్ప సమయమే ఉంది. అధికారం చేపట్టిన టీఆర్ఎస్ కే ఎంపీ స్థానాలు కూడా గంపగుత్తగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీ కే అధికారం కట్టబెట్టడానికి ప్రజలు ఆలోచిస్తారు. మధ్య లో వచ్చిన జీహెచ్ఎంసీ ఫలితాలే ఇందుకు నిదర్శనం. అందుకే రేవంత్ సహా ఏ ఓడిపోయిన దిగ్గజ లీడర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి సాహసించడం లేదు. చేస్తే ఓడిపోతామన్న భయం మరోసారి వారిని వెంటాడుతోంది. అందుకే ఇప్పట్లో జరిగే ఎంపీ ఎలక్షన్లతో పాటు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను కూడా కాంగ్రెస్ వదిలేసుకుంటేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.