Begin typing your search above and press return to search.

రాష్ట్రం కంటే రాజ‌కీయాలే ముఖ్య‌మా బాబూ?

By:  Tupaki Desk   |   17 Dec 2018 7:59 AM GMT
రాష్ట్రం కంటే రాజ‌కీయాలే ముఖ్య‌మా బాబూ?
X
రోమ్ న‌గ‌ర‌మంతా త‌గ‌ల‌బ‌డుతుంటే తీరిగ్గా ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడ‌ట అప్ప‌ట్లో నీరో చ‌క్ర‌వ‌ర్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడి వ్య‌వ‌హార శైలి కూడా ఇప్పుడు అదే త‌ర‌హాలో క‌నిపిస్తోంది. ఓ వైపు రాష్ట్రం పై పెథాయ్ తుపాను విరుచుకుప‌డుతుంటే.. ఆయ‌న మాత్రం తీరిగ్గా ఉత్త‌రాదిన ముఖ్య‌మంత్రుల ప్ర‌మాణ స్వీకార ఉత్స‌వాల‌కు హాజ‌ర‌య్యేందుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే త‌న సొంత‌ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కే చంద్ర‌బాబు పెద్ద పీట వేస్తార‌ని ఆయ‌న తీరు స్ప‌ష్టం చేస్తోంద‌ని విశ్లేష‌కులు మండిప‌డుతున్నారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వంతో చంద్రబాబు కు ప్ర‌స్తుతం బ‌ద్ధ శ‌త్రుత్వం ఉంది. బీజేపీని ఓడించేందుకు ఆయ‌న ఎంత‌టి ప‌నికైనా సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు అలాంటి ఓ ప్ర‌య‌త్న‌మే. అయితే - తెలంగాణ‌లో చంద్ర‌బాబు ను త‌మ‌తో క‌లుపుకోవ‌డం కాంగ్రెస్ కు తీవ్ర న‌ష్టం క‌లిగించింది. వారి ప్ర‌జా కూట‌మి ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. ఈ ప‌రాభ‌వానికి చంద్ర‌బాబు తో దోస్తీయే కార‌ణ‌మ‌ని తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు లోలోప‌ల ర‌గిలిపోతున్నారు. దానికి సంబంధించి ఇప్ప‌టికే త‌మ వాద‌న‌ను అధిష్ఠానం ముందు వినిపించారు కూడా.

ఈ నేప‌థ్యం లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పొత్తుకు కాంగ్రెస్ త‌న‌ను దూరం పెడుతుందోమోన‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. అదే జ‌రిగితే ఇటు బీజీపీ కి దూర‌మై, అటు కాంగ్రెస్ కు దూర‌మై సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం కేంద్రంలో ఎవ‌రి అండా లేకుండా ఒంట‌రిగా ఉండాల్సి వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నార‌ట‌. హ‌స్తం పార్టీతో దోస్తీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దులుకోవ‌ద్ద‌ని అనుకుంటున్నార‌ట‌. అందుకే సోమ‌వారం రాజ‌స్థాన్‌- మ‌ధ్య‌ప్ర‌దేశ్‌- ఛ‌త్తీస్ గ‌ఢ్ ల‌లో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఆయ‌న బ‌య‌లుదేరి వెళ్లార‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌.

కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల ప్ర‌మాణ స్వీకార ఉత్స‌వాల్లో పాల్గొన‌డం చంద్ర‌బాబు ఇష్టం. కానీ - రాష్ట్రం లో ప్ర‌స్తుతం పెథాయ్ తుపాను అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. కోస్తాంధ్ర‌ను గ‌జ‌గ‌జా వణికిస్తోంది. పెథాయ్ సోమ‌వారం కాకినాడ వద్ద తీరం దాటుతుందనే వాతావరణ అంచనాలు రెండు మూడు రోజుల ముందునుంచి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు అండ‌గా స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించేందుకు వీలుగా సీఎం రాష్ట్రంలో ఉంటే బాగుంటుంది. వీలైతే తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లోనూ ఆయ‌న మ‌కాం వేయాలి. అంతే త‌ప్ప స్వ‌లాభం కోసం వేరే రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డ‌మేంట‌ని విశ్లేష‌కులు నిల‌దీస్తున్నారు.