Begin typing your search above and press return to search.

అంద‌రికంటే ఘోర ప‌రాభ‌వం చంద్ర‌బాబుకే!

By:  Tupaki Desk   |   12 Dec 2018 8:11 AM GMT
అంద‌రికంటే ఘోర ప‌రాభ‌వం చంద్ర‌బాబుకే!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ప‌లు పార్టీల‌కు శ‌రాఘాతంగా మారాయి. ఇటీవ‌లి చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత హీనంగా కాంగ్రెస్ ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైంది. కోదండ‌రాం నేతృత్వంలోని టీజేఎస్‌- వామ‌ప‌క్ష పార్టీ సీపీఐ క‌నీసం ఖాతా కూడా తెర‌వ‌లేక చ‌తికిల‌ప‌డ్డాయి. బీజేపీ కి ద‌క్కింది ఒక్క‌టంటే ఒక్క సీటే. అయిన‌ప్ప‌టికీ ఈ ఎన్నిక‌ల్లో వారి కంటే అత్యంత ఘోరంగా ఓట‌మి పాలైంది చంద్ర‌బాబు నాయుడేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం.. నిజానికి తెలంగాణ‌లో ప్ర‌జా కూట‌మి రూప‌శిల్పి చంద్ర‌బాబే. రాష్ట్రంలో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో దిగిన అభ్య‌ర్థులంద‌ర్నీ ఆయ‌నే ఎంపిక చేశారు. కూట‌మి అభ్య‌ర్థుల ఎంపిక‌నూ ప‌ర్య‌వేక్షించారు. ఆయ‌న ఒత్తిడి వ‌ల్లే కాంగ్రెస్ ప‌లువురికి సీట్లు కేటాయించింది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు చంద్ర‌బాబు భారీగా ఫండ్స్ ఇచ్చార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. కాంగ్రెస్ నేత‌ల ప్ర‌చారానికి హెలికాప్ట‌ర్లు కూడా ఆయ‌నే స‌మ‌కూర్చార‌ట‌. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో క‌లిసి వ‌చ్చి తెలంగాణ‌లో బాబు స్వ‌యంగా ప్ర‌చారం కూడా చేశారు.

అయితే - తెలంగాణ‌లో చంద్ర‌బాబు ఎత్తులు పార‌లేదు. ఆయ‌న వ్యూహాలు చిత్త‌య్యాయి. కూట‌మి ఘోర ప‌రాజ‌యం పాలైంది. వాస్త‌వానికి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌ర్వాత టీడీపీ కార్య‌క‌ర్త‌లంగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. వైసీపీలాగే రాష్ట్రంలో టీడీపీ కూడా క‌నుమ‌రుగైంది. కానీ - చంద్ర‌బాబు ఈ స‌త్యాన్ని అంగీక‌రించ‌లేక‌పోయారు. త‌మ‌కు క్షేత్ర‌స్థాయిలో ఇంకా ప‌ట్టుంద‌ని భ్ర‌మ‌ప‌డ్డారు. అలాగే మాయ‌మాట‌లు చెప్తూ కాంగ్రెస్ ను బుట్ట‌లో వేశారు.

తెలంగాణ‌లో ఘోర ప‌రాభ‌వం ఎదుర‌వ్వ‌డంతో ఆయ‌న‌తో పొత్తు పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ‌టం ఖాయం. అస‌లే ఏపీలో ఈ ద‌ఫా చంద్ర‌బాబుపై ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు - ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ తో వైసీపీ నేత జ‌గ‌న్ బాగానే బ‌ల‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌తో కూట‌మి స‌బ‌బు కాద‌ని కాంగ్రెస్ భావించొచ్చు. బీజేపీ కూడా ఏపీలో బ‌స్సు యాత్ర‌కు ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కు చిక్కులు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.