120 మంది మహిళలపై రేప్..పూజారి నిర్వాకం

Sun Jul 22 2018 10:14:27 GMT+0530 (IST)

ఒక పూజారి చేసిన నీచం ఒళ్లుగగుర్పాటుకు గురి చేయటమే కాదు.. షాకింగ్ గా మారింది. పూజ్యనీయమైన వృత్తిలో ఉండి.. దారుణాలకు పాల్పడిన దుర్మార్గం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తమ సమస్యల్ని పరిష్కరిస్తాడన్న ఆశతో ఆశ్రయించిన మహిళలపై ఒక గుడి పూజారి చేసిన అత్యాచారకాండ ఇప్పుడు సంచలనంగా మారింది. 120 మంది మహిళల్ని అత్యాచారం చేయటం ఒక ఎత్తు అయితే.. అందుకు సంబంధించిన వీడియోల్ని సెల్ ఫోన్లో షూట్ చేసిన నీచం తాజాగా బయటకు వచ్చింది.హర్యానాలోని ఫతేహాబాద్లో ఉన్న తొహనా పట్టణంలో బాబా అమర్ పురి అలియాస్ బిల్లు అనే 60 ఏళ్ల పూజారి బాబా బాలక్ నాథ్ ఆలయానికి పూజారిగా వ్యవహరిస్తుంటాడు. తమ వ్యక్తిగత సమస్యల్ని చెప్పుకున్న మహిళలకు మాయ మాటలు చెప్పేవాడు.

తాంత్రిక పూజలు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మించి తీర్థ ప్రసాదాలలో మత్తుమందు కలిపేవాడు. మహిళలు స్పృహలో లేనప్పుడు వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ దుర్మార్గాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించేవాడు. వాటిని చూపించి.. మళ్లీ మళ్లీ లొంగదీసుకునేవారు. ఇలా 120 మంది జీవితాలతో ఆడుకున్న అతగాడి నీచం తాజాగా బద్ధలైంది. ఒక వీడియో బయటకు రావటం.. అది కాస్తా నెట్ లో వైరల్ గా మారటంతో బాబా సమీప బంధువు ఒకరు చూశారు. దాన్ని పోలీసులకు చూపించాడు.

దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు పూజారి ఇంటిని తనికీ చేసి.. అనుమానాస్పదంగా ఉన్న వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తాను లంచం ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే తనను అరెస్ట్ చేశారంటూ పూజారి బుకాయించటం మొదలెట్టాడు. అతగాడికి కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరు బాధిత మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు వచ్చి చెబుతామని చెప్పారు. కన్నింగ్ పూజారి కుట్రను బయటపెట్టేందుకు వీలుగా.. అతడి దుర్మార్గాల్ని బయటపెట్టే వీడియోల్ని పోలీసులు సేకరిస్తున్నారు.