Begin typing your search above and press return to search.

క్లాస్ రూమ్ లో థర్డ్ డిగ్రీ శిక్షలు?

By:  Tupaki Desk   |   30 Sep 2016 8:07 AM GMT
క్లాస్ రూమ్ లో థర్డ్ డిగ్రీ శిక్షలు?
X
చెంపలు గట్టిగా వాయించడం, ఒళ్లు జలదరించేలా బాదడం వంటివి సాధారణంగా సినిమాల్లోని పోలీస్ స్టేషన్ లలో చూసే సన్నివేశాలు! అక్కడ కూడా చాలా పద్దతిగా ఉంటాయి సన్నివేశాలు. కానీ... అమ్మాయిలను జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఉన్మాదిలా ఊగిపోతూ కొడితే.. తలకు గట్టిగా దెబ్బలు తగిలేలా బలంగా కొడితే... చెంపలు ఎడాపెడా గట్టిగా ఏదో కక్ష గట్టినట్లు వాయించేస్తే... అమ్మాయిలనుసైతం గొడ్డును బాదినట్టు బాదితే... ఇక అబ్బాయిల చేతులు బొబ్బలెక్కేలా రాక్షసంగా ఊగిపోతూ బాదేస్తే... ఆగండాగండి ఇది థర్డ్ డిగ్రీ శిక్షలు కదా అని సినిమా జ్ఞానంతో అనుకుంటే పొరపాటే! ఇది ఒక స్కూలు టీచర్ చేసిన పని. హోం వర్క్ చేయలేదనే కోపంతో ఒక టీచర్ విద్యార్థులపై చూపించిన ప్రతాపం ఇది! నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాల్సిన విషయం ఇది!!

వివరాల్లోకి వెళితే... హరియాణాలోని కర్నల్ లో ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఒక టీచర్. అతను "వీదిరౌడీ"గా ప్రవర్తించినా, విజ్ఞత మరిచి ఆడపిల్లలపై చేయిచేసుకున్నా... అతడి వృత్తి పాఠాలు చెప్పడం కాబట్టి సభమర్యాద కోసం కాసేపు "టీచర్" అనే సంబోదించాలి!! ఈ టీచర్ నామధేయం ప్రదీప్ ఆరోరా, ఆ కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఇతడే. టెంత్ క్లాస్, ఇంటర్ విద్యార్థులను హోం వర్క్ చేయలేదనే కారణంతో దారుణంగా కొట్టాడు. ఆ సన్నివేశాలను క్లాస్ లో వెనుక కూర్చున్న ఒక విద్యార్థి మొబైల్ ఫోన్ తో వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్స్ లో వైరల్ అయ్యింది. దీంతో టీవీలో కూడా ప్రసారమవడంతో టీచర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో టీవీలో ప్రసారమైన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు కర్నల్ ఎస్పీ పంకజ్ నైన్!

కాగా, రిటైర్డ్ నేవీ ఉద్యోగి అయిన ఈ ప్రదీప్ అరోరా ఈ విషయాలపై స్పందిస్తూ... మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ఎలాంటి శిక్షయినా వేయాలని వారి తల్లిదండ్రులు తనకు చెప్పారని వివరణ ఇచ్చాడు. ఈ వివరణకు బలం చేకూరుస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఏ ఒక్కరూ ఈ టీచర్ పై ఫిర్యాదు చేయలేదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/