Begin typing your search above and press return to search.

పోలీసుల‌కు హ‌ర్లీ డేవిడ్ స‌న్ బైకులు!

By:  Tupaki Desk   |   18 Aug 2017 4:33 PM GMT
పోలీసుల‌కు హ‌ర్లీ డేవిడ్ స‌న్ బైకులు!
X
సాధారణంగా మ‌న దేశంలోని పోలీసులు రాయ‌ల్ ఇన్ ఫీల్డ్‌ - లేదా సాధార‌ణ బైక్ ల‌పై విధులు నిర్వ‌ర్తిస్తుంటారు. అయితే - కోల్ క‌తా ప్ర‌భుత్వం త‌మ పోలీసులు మిగ‌తా రాష్ట్ర పోలీసుల‌కు భిన్నంగా ఉండాల‌ని ఆలోచించింది. అనుకున్న‌దే త‌డ‌వుగా అక్క‌డి పోలీసుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హ‌ర్లీ డేవిడ్ స‌న్ బైకుల‌ను అందించింది. త‌మ పోలీసుల‌కు కొత్త సాంకేతికతను అందించడంలో ప్ర‌భుత్వం ముందుంటుంద‌ని నిరూపించింది.

స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక‌ల‌ సందర్భంగా తొలిసారి కోల్‌ కతా పోలీసులు ఐదు హర్లీ డేవిడ్‌ సన్‌ స్ట్రీట్ 750 బైకులతో పెట్రోలింగ్‌ నిర్వహించి ఆ వేడుక‌ల‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. అయితే, ఆ బైకుల‌ను కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో వాడేందుకు మాత్ర‌మే కొనుగోలు చేశార‌ని తెలుస్తోంది.

ఈ బైకులను కొనుగోలు చేసేందుకు మ‌మ‌త స‌ర్కార్ భారీగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టింది. సాధార‌ణంగా హర్లీ డేవిడ్‌ సన్‌ స్ట్రీట్‌ 750 బైకు షోరూం ధర రూ.4.9 లక్షలే. పోలీసుల కోసం ప్రత్యేకమైన సదుపాయాల కోసం కొన్ని మార్పులతో వాటిని త‌యారు చేయించారు. దీంతో, ఒక్కో బైక్ ధ‌ర‌ రూ.5.5 లక్షలకు చేరింది. మొత్తం 5 బైకుల‌ను ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుతం కోల్‌కతా పోలీసులు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులను వాడుతున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన హర్లీ డేవిడ్‌ సన్‌ బైకులు, రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ బైకులకు జత కలిశాయి.

ఈ హ‌ర్లీ డేవిడ్ స‌న్ బైకుల‌ను కోల్ క‌తా ప్ర‌భుత్వం రెండు నెల‌ల క్రిత‌మే కొనుగోలు చేసింది. స్వాతంత్య్ర దినోత్స‌వ సంద‌ర్భంగా వీటిని తొలిసారిగా ప్ర‌ద‌ర్శించింది. అయితే, ఈ 5 బైకుల‌ను ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో మాత్ర‌మే వినియోగించ‌నున్న‌ట్లు కోల్ క‌తా ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సాల్మ‌న్ తెలిపారు. వీటిని రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న‌ - స్వాతంత్య్ర దినోత్స‌వ ప‌రేడ్‌ - ప్ర‌త్యేక‌మైన వేడుక‌ల సంద‌ర్భంగా మాత్ర‌మే ఉప‌యోగిస్తామ‌ని - ప్ర‌స్తుతం ఉన్న రాయ‌ల్ ఇన్ ఫీల్డ్ బైకుల‌కు ఇవి ప్ర‌త్యామ్నాయం కాద‌ని చెప్పారు. త్వ‌ర‌లో క‌ల‌క‌త్తాలో జ‌ర‌గ‌బోయే దుర్గామాత వేడుక‌ల సంద‌ర్భంగా వీటిని మ‌ళ్లీ ప్ర‌ద‌ర్శిస్తామ‌ని, ఆ వేడుక‌ల్లో ఇవి ప్ర‌జ‌ల‌కు ఆక‌ట్టుకుంటాయ‌ని ఆయ‌న తెలిపారు.