Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌ రావు....ఎంత ప‌నిచేశావు

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:25 PM GMT
హ‌రీశ్‌ రావు....ఎంత ప‌నిచేశావు
X
త‌న్నీరు హ‌రీశ్‌ రావు. తెలంగాణ రాష్ర్ట‌స‌మితి కీల‌క నేత‌ - తెలంగాణ ప్ర‌భుత్వంలో సీనియ‌ర్ మంత్రి. వీట‌న్నింటికీ మించి ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు మేన‌ల్లుడు. పార్టీలో ప్ర‌తి కీల‌క ప‌రిణామంలో ఆయ‌న పాత్ర ఉంటుంది. ఆయ‌న‌తో చ‌ర్చించ‌నిదే కేసీఆర్ ఏ ముఖ్య నిర్ణ‌యం తీసుకోర‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. అయితే అంత‌టి ముఖ్య‌మైన స్థానంలో ఉన్న హ‌రీశ్‌రావు తాజాగా టీఆర్ఎస్ నాయ‌కుల‌ను త‌న మాట‌ల‌తో హ‌ర్ట్ చేశారు. అరే అదేంటి...కార్య‌క‌ర్త‌ల నాయ‌కుడిగా ఉండ‌టానికి ఇష్ట‌పడే హ‌రీశ్‌రావు అలా ఎలా చేశారు? ఎందుకు చేశారు అనుకుంటున్నారా? చ‌ద‌వండి మ‌రి.

తెలంగాణ కేబినెట్ లో మార్పులు ఉంటాయ‌ని చాలా కాలంగా ప్రచారం జ‌రుగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ ప‌లువురు మంత్రుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం - గ‌వ‌ర్న‌ర్‌ తో సుదీర్ఘ భేటీ జ‌ర‌ప‌డం ఈ వాద‌న‌ల‌కు బ‌లం చేకూర్చింది. తాజాగా అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న‌ నేప‌థ్యంలో మంత్రి హ‌రీశ్‌రావుతో మీడియా ప్ర‌తినిధులు మాట క‌లిపారు. మంత్రివర్గంలో మార్పులు - చేర్పులపై జరుగుతన్న ప్రచారంపై ఆయ‌న్ను క‌దిలించారు. దీంతో హ‌రీశ్ రావు స్పందిస్తూ కేబినెట్ మార్పులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. దీంతో పాటు ఆ ప్ర‌చార‌మే అభూత కల్పనగా హరీశ్ రావు అభివర్ణించారు. తన‌కు తెలిసినంత‌మేర‌కు ఆ క‌స‌ర‌త్తు లేద‌ని చెప్పారు. ప‌నిలో ప‌నిగా మ‌రో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని, అలాగే కమిటీల చేపడతామని హరీశ్ రావు అన్నారు.

కేబినెట్ మార్పులు ఉండ‌వ‌ని హ‌రీశ్‌ రావు చేసిన ప్ర‌క‌ట‌న హిట్‌లిస్ట్ లో ఉన్న మంత్రుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేదే. అయితే ఆశావ‌హ‌లును మాత్రం మ‌రింత కాలం నిరీక్ష‌ణ‌లో ఉంచిన‌ట్ల‌యింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా పార్టీ కార్య‌క‌ర్త‌ల కోసం నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీచేయ‌డం మాత్రం హర్ష‌నీయ‌మ‌ని గులాబీ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.