Begin typing your search above and press return to search.

ఇలా చేయ‌డం హ‌రీశ్‌ కు మాత్ర‌మే సాధ్యం

By:  Tupaki Desk   |   4 Dec 2016 6:06 AM GMT
ఇలా చేయ‌డం హ‌రీశ్‌ కు మాత్ర‌మే సాధ్యం
X
టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ రెండున్న‌రేళ్ల ప‌రిపాల‌న‌పై కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించడంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు ఊహించ‌ని రిప్లై ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అవినీతిలో నంబర్‌ వన్ - తెలంగాణపై వివక్ష ప్రదర్శించడంలో నంబర్‌ వన్ సాధించారని తీవ్రస్థాయిలో విమర్శించారు. టీఆర్‌ ఎస్ ప్రభుత్వానికి మ్యానిఫెస్టో పవిత్ర గ్రంథంతో సమానమన్నారు. ఇచ్చిన - ఇవ్వని హామీలతో కలిపి 300 కార్యక్రమాలను అమలుచేసిందన్నారు. మీరు మ్యానిఫెస్టోలోని ఒక్క హామీనైనా అమలుచేశారా అని ప్రశ్నించారు. ఇలా చేపట్టిన ప‌థ‌కాలు - తీసుకున్న నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించిన హ‌రీశ్ రావు ఈ వివరాలు గాంధీభవన్‌ కు పంపుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ నేతలు బాగా చదువుకొని త‌మ‌ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా తెలుసుకోవాల‌ని సూచించారు.

రెండున్నరేళ్ల‌లోనే మిగతా రాష్ట్రాలు అనుసరించే పథకాలు అమలుచేశామని, ఇది తట్టుకోలేక చేస్తున్న దీక్షలకు అసూయ దీక్షగా పేరు పెడితే బాగుంటుందని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్ నేత‌లు మాట్లాడితే నరహంతకులు పావురాలు ఎగిరేసినట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ ఎస్ మ్యానిఫెస్టో ఉద్యమ ఆకాంక్ష నుంచి పుట్టిందని, అది తెలంగాణ దశా-దిశను నిర్దేశిస్తుందని తెలిపారు. మ్యానిఫెస్టో పవిత్ర గ్రంథంతో సమానమ‌ని, నూటికి నూరుపాళ్లు మ్యానిఫెస్టో అమలుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామ‌ని హ‌రీశ్ రావు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ మాదిరిగా ఎన్నికల్లో గెలిచేందుకు హామీలు ఇచ్చి, ఎన్నికలు ముగిశాక మరిచిపోయేది కాదని తెలిపారు. మాటలకు, చేతలకు పొంతనలేని కాంగ్రెస్ నేత‌లు.. మాట మీద ఉన్న టీఆర్‌ ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్టేన‌ని మండిప‌డ్డారు.

కాంగ్రెస్ నాయ‌కులు కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో మంత్రులుగా ఉండి ఏం ఎలగబెట్టారని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు. చిల్లర ప్రచారం కోసం చౌకబారు విమర్శలు చేస్తే చులకన అవుతారని హితవు పలికారు. తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొంటుంటే, రాష్ట్ర నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాలను సమదృష్టితో చూసి మంచి పాలన అందిస్తూ దేశంలోనే నంబర్ వన్ సీఎంగా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, 30 వేల ఉద్యోగాలు - 20 వేల కాంట్రాక్ట్ ఉద్యోగాల రెగ్యులరైజ్ - కల్యాణలక్ష్మి - 36 లక్షల మందికి ఆసరా, 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ - సాదాబైనామాలున్న 11 లక్షల మంది రైతులకు ఉచిత రిజిస్ట్రేషన్ - లక్షా 25 వేల మందికి జీవో 58 ద్వారా భూపట్టాలు - విత్తనాలు - ఎరువులు - గోదాములు నిర్మించి చరిత్ర సృష్టించామన్నారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు - ట్రాక్టర్లు - ఆటోలకు పన్ను మినహాయింపు - ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 6 లక్షలు - అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు - ఉద్యోగం ఇచ్చామని.. ఇలా చెప్పుకుంటూపోతే 300 కార్యక్రమాలు ఉన్నాయన్నారు


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/