Begin typing your search above and press return to search.

క‌వ‌ర్ చేశారు కానీ కుద‌ర్లేదు హ‌రీశ్ సాబ్‌?

By:  Tupaki Desk   |   23 Sep 2018 7:46 AM GMT
క‌వ‌ర్ చేశారు కానీ కుద‌ర్లేదు హ‌రీశ్ సాబ్‌?
X
తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడిగా సుప‌రిచిత‌మైన హ‌రీశ్ రావు ఇప్పుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్లే అధికార‌పార్టీకి చెందిన మీడియాలో హ‌రీశ్ ఫోటో ఇప్పుడో కానీ రాని ప‌రిస్థితి.

ఇదిలా ఉండ‌గానే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన కొన్నాళ్ల‌కే సీఎం ప‌గ్గాలు కొడుకు కేటీఆర్ చేతుల్లో పెట్టి.. తాను ఢిల్లీకి వెళ్లి చ‌క్రం తిప్పాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.దీనికి త‌గ్గ‌ట్లే టికెట్ల పంపిణీ మొద‌లు.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించిన అంశాలు కానీ.. టికెట్లు రాక ర‌గిలిపోతున్న అసంతృప్తుల్ని బుజ్జ‌గించ‌టంతో పాటు కేసీఆర్ ఇవ్వాల్సిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌ను సైతం ఆయ‌న‌కు బ‌దులుగా కేటీఆర్ ఇస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ టీఆర్ ఎస్ పార్టీలో కేసీఆర్ త‌ర్వాత అధినేత‌కు రెండు చేతులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేటీఆర్‌.. హ‌రీశ్ ల‌లో త‌న కొడుక్కి మాత్ర‌మే ప్ర‌తిచోటా ప్రాధాన్య‌త ల‌భించేలా చుట్టూ ఉన్న ప‌రిస్థితుల్ని మారుస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే మీడియాలోనూ హ‌రీశ్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌కు స్థానం ద‌క్క‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది.

ఇలాంటి వేళ‌.. ఒక ప్ర‌ముఖ ప‌త్రిక‌లో హ‌రీశ్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూను ప్ర‌ముఖంగా వేశారు. అందులో.. ఆయ‌న చాలా విష‌యాల్లో తాను కేసీఆర్ మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని.. ఆయ‌న గీసిన గీత‌ను దాట‌నంటూ త‌న సంపూర్ణ విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఉద్య‌మ స‌మ‌యాల్లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున తెలంగాణ మొత్తం ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. తాజా ఎన్నిక‌ల్లో మాత్రం త‌న పాత్ర ప‌రిమిత‌మ‌న్న మాట‌ను తాజా ఇంట‌ర్వ్యూలో చెప్ప‌క‌నే చెప్పేయ‌టం క‌నిపిస్తుంది.

ఎంత‌గా క‌వ‌ర్ చేసినా.. హ‌రీశ్ ను ప‌రిమితం చేశార‌ని.. ప‌రిధులు విధించార‌న్న విష‌యం ఆయ‌న నోటి వెంట చెప్పే మాట‌లు చెప్ప‌క‌నే చెప్పేయ‌టం క‌నిపిస్తుంది. ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో హ‌రీశ్ ను అడిగిన ప్ర‌శ్న‌లు.. చెప్పిన స‌మాధానాల్ని కాస్తంత జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే.. అస‌లు విష‌యం అర్థ‌మ‌వుతుంది. అవేమిటో చూస్తే..

1. ప్ర‌శ్న‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారా?

హ‌రీశ్‌: ఎవరు ఎక్కడ తిరగాలనేది మా నాయకుడు నిర్ణయిస్తారు. ఎవరి అవసరం ఎక్కడుంటే వారిని అక్కడికి పంపుతారు. నాయకుడు - పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తా. ప్రస్తుతానికి మంత్రులను తమ జిల్లాల్లో సమన్వయం చేసుకోమన్నారు. మా జిల్లాలో నర్సాపూర్‌ - అందోల్‌ - నారాయణఖేడ్‌ - సంగారెడ్డి - పటాన్‌ చెరు తదితర నియోజకవర్గాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకొని ముమ్మర ప్రచారం చేపట్టాం.

2. ప్ర‌శ్న‌: ఉద్యమ నేతగా 2014కు ముందు మీరు రాష్ట్రమంతా పర్యటించారు. అధికారంలోకి వచ్చాక కీలక శాఖలు చేపట్టారు. అప్పటికీ - ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చింది?

హ‌రీశ్‌: 2014కు ముందు తెలంగాణ ప్రజల్లో నిరాశ - నిస్పృహలు ఉండేవి. వలసలు - ఆత్మహత్యలు నిత్యకృత్యంగా కనిపించేవి. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించా. కొన్ని నియోజకవర్గాల్లో నాలుగైదుసార్లు తిరిగా. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. తెరాస ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ప్రాజెక్టులు కడుతున్నాం. ఉపాధికి బాటలు వేస్తున్నాం.

వీటన్నింటితో ప్రజల్లో అభద్రతాభావం తొలగింది. మా జీవితంలో మార్పు వస్తుందనే ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. అప్పట్లో వలసలు వెళ్లేవారు. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. మహబూబ్‌ నగర్‌ లాంటి జిల్లాల్లో వలస వెళ్లినవారు గ్రామాలకు తిరిగివస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. చాలా చోట్ల ప్రైవేటు ఆసుపత్రులు మూతపడే పరిస్థితి వచ్చింది. 2014కు ముందు బడ్జెట్‌ సమావేశాల్లో విద్యుత్‌ - మంచినీటిపై గొడవలు - వాకౌట్లు లేకుండా శాసనసభ సమావేశాలు జరిగేవి కాదు. ఇప్పుడవి లేవు. ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

3. ప్ర‌శ్న‌: కేటీఆర్‌ కు మీకు మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతుంది?

హ‌రీశ్‌: ఇది పూర్తిగా అబద్ధం. నేను రెగ్యులర్‌ గా కేటీఆర్‌ ను కలుస్తుంటాను. మాట్లాడుకుంటుంటాం. పార్టీలో స్పష్టమైన సమన్వయంతోనే పనిచేస్తున్నాం. విభేదాలకు - వివాదాలకు చోటే లేదు. అందరికీ శక్తి - సామర్థ్యాలుంటాయి. ఎవరిని ఎప్పుడు ఎలా వినియోగించుకోవాలో కేసీఆర్‌ కు బాగా తెలుసు. విభేదాలన్నీ ఊహాజనితం. నాయకుడు ఏం చెపితే హరీశ్‌రావు అదే చేస్తాడు. ఆయన మాట అటూ, ఇటూ ఎప్పుడూ దాటను. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

4. ప్ర‌శ్న‌:ఈ ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి - తెలంగాణ ప్రజలకు పోరాటమని కాంగ్రెస్‌ అంటోంది. మీరేమంటారు?

హ‌రీశ్‌: ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల మాట్లాడేందుకు కాంగ్రెస్‌ వారికి పాయింటే లేదు. అందుకనే ఇలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ చెప్పాలంటే.. తెరాస ప్రభుత్వం కరెంటు మంచిగా ఇచ్చిందని చెప్పాలి. తెరాసకంటే మేం మంచిగా కరెంటు ఇచ్చామని చెప్పుకోలేదు కదా. ఎరువులు - విత్తనాలు మంచిగా ఇచ్చాం అని చెప్పగలదా? మా హయాంలో ఎరువులు - విత్తనాలు కొరతలున్నందున క్యూలైన్లు పెట్టాం - తెరాస వచ్చిన తర్వాత అవి లేవని చెబుతుందా? ఎన్నికల ప్రణాళికలో చెప్పకపోయినా కల్యాణలక్ష్మి - షాదీముబారక్‌ పథకాలు తెచ్చి ప్రతి ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్నాం. మిషన్‌ భగీరథలాంటి గొప్ప కార్యక్రమం తెచ్చాం. దీంతో దేశమంతా తెలంగాణను అభినందిస్తోంది.

60 ఏళ్ల కాంగ్రెస్‌ - తెలుగుదేశం హయాంలో జరగని వాటిని కేసీఆర్‌ ప్రభుత్వం చేసింది గనుక ఆ పార్టీలేవీ కూడా విమర్శించే పరిస్థితి లేదు. అవి మమ్మల్ని ప్రశ్నిస్తే 60 ఏళ్లలో మీరేం చేశారని ప్రజలు నిలదీస్తారు. 11 రోజులు ఆమరణ దీక్ష చేసి చావు నోట్లోకి వెళ్లి కేసీఆర్‌ తెలంగాణ సాధించారు. అంతకు మించిన త్యాగం మరొకటి ఉంటుందా? ప్రాణాన్ని లెక్కచేయకుండా ఆయన చేసిన దీక్ష వల్లే కదా ఆరోజు రాత్రి దిల్లీలో చిదంబరం ప్రకటన చేశారు. ఆ దీక్ష, పోరాటం లేకపోతే.. తెరాస పుట్టకపోతే తెలంగాణ వచ్చేదా? అలాంటి కేసీఆర్‌ కుటుంబంపైనా విమర్శలా?