Begin typing your search above and press return to search.

మంత్రి హ‌రీష్ రావుకి మిస్డ్ కాల్ ఇస్తే చాలు!

By:  Tupaki Desk   |   26 July 2016 4:49 AM GMT
మంత్రి హ‌రీష్ రావుకి మిస్డ్ కాల్ ఇస్తే చాలు!
X
‘బిజీగా ఉన్నా త‌రువాత చేయండి’.. అంటూ చాలామంది ఫోన్స్ క‌ట్ చేస్తూ ఉంటారు! అంద‌రూ చెప్పే రొటీన్ సాకు.. ‘బిజీగా ఉన్నాను’ అన‌డం! అయితే, తెలంగాణ నీటిపారుదల శాఖ‌మంత్రి హ‌రీష్ రావు అలాకాదు. ఆయ‌న ఎంత బిజీగా ఉన్నా తిరిగి కాల్ చేస్తార‌ట‌! ఈరోజుల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే నాయ‌కులు ఎంత‌మంది ఉంటారు చెప్పండీ..? చాలా అరుదు క‌దా. అలాంటి జాబితాలో మంత్రి హ‌రీష్‌ రావు పేరును చేర్చాల్సిందే. ఎందుకంటే, ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఫోన్‌ లో అందుబాటులో ఉంటున్నార‌ట‌. రోజులో కొన్ని గంట‌లే అని కాకుండా.. రోజంతా, అంటే 24 గంట‌లూ 365 రోజ‌లూ ఆయ‌న ఫోన్‌ లో అందుబాటులో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక‌వేళ ఏదైనా మీటింగ్‌ లో ఉన్న‌ప్పుడు ఫోన్లు వ‌చ్చాయే అనుకోండి... ఆ మీటింగ్ అయిన వెంట‌నే మిస్డ్ కాల్స్ చూసుకుని మ‌రీ కాల్ బ్యాక్ చేసి ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటున్నార‌ట‌.

సొంత నియోజ‌క వ‌ర్గం సిద్ధిపేట నుంచే కాదు - రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా ప్ర‌తీ రోజూ ఎన్నో కాల్స్ వ‌స్తుంటాయ‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఎన్ని ఫోన్లు వ‌చ్చినా మంత్రి విసుగు లేకుండా మాట్లాడ‌తార‌ని అన్నారు. రోజువారీ వ‌చ్చే కాల్స్‌ లో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కి సంబంధించినీ - ప్ర‌భుత్వం త‌ర‌ఫున చికిత్స కోసం అర్జీలే ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని పార్టీ నేత‌లు వివ‌రించారు. పోలీసు స్టేష‌న్ల‌లో ఉన్న పెండింగ్ కేసులు - ఇత‌ర ప్రభుత్వ శాఖల వ‌ద్ద పెండింగ్‌ లో ఉన్న త‌మ ప‌నుల ప‌రిస్థితుల గురించి ప్ర‌జలు ఎక్కువ‌గా హ‌రీష్‌ తో ఇంట‌రాక్ట్ అవుతున్న‌ట్టు చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు వెంట‌నే ప‌రిష్కార మార్గాల‌ను కూడా హరీష్ సూచిస్తూ ఉంటార‌ట‌.

నిజానికి - ఇలా ఫోన్‌ లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టం అనేది మంత్రి హ‌రీష్‌ రావుకు కొత్తగా అల‌వ‌డింది కాదు! తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఈ అల‌వాటు ఆయ‌న‌కి ఉంది. 2000 సంవ‌త్స‌రానికి ముందు నుంచే ఆయ‌న ఫోన్‌ లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టం ప్రారంభించారు. ఉద్య‌మ తీరు తెన్నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. సో... ఇప్పుడు మంత్రిగా కూడా అదే అల‌వాటును కొన‌సాగించ‌డం మెచ్చుకోద‌గ్గ విష‌య‌మే. ఫోన్ నంబ‌ర్లు బ‌హిర్గ‌తం చేసేందుకు భ‌య‌ప‌డుతున్న నాయ‌కులున్న ఈ రోజుల్లో - మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా స్పందించే మంత్రి ఉండ‌టం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం. ఇత‌ర నాయ‌కులు కూడా హ‌రీష్‌ ను ఆద‌ర్శంగా తీసుకుంటే బాగుంటుంది.