Begin typing your search above and press return to search.

హరీశ్ డిఫెన్స్ లో పడ్డారా?

By:  Tupaki Desk   |   25 July 2016 9:44 AM GMT
హరీశ్ డిఫెన్స్ లో పడ్డారా?
X
తన దూకుడుతో ప్రత్యర్థి పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వని నేతల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఒకరు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే ఆయన మాటల ప్రవాహానికి అడ్డూ ఆపూ ఉండదు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే ఆయన.. తాజాగా నిర్వహించిన విలేకరుల మసావేశంలో అందుకు భిన్నగా ఉంటం గమనార్హం. మల్లన్నసాగర్ ముంపు బాధితులపై పోలీసులు అమానుషంగా లాఠీ ఛార్జ్ చేశారంటూ విపక్షాలు ఈ రోజు మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ లో పాలు పంచుకోవటానికి.. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల్ని.. బాధితుల్ని పరామర్శించేందుకు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదంరాంను పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ.. టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డితో సహా మరికొందరు విపక్ష నేతల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వేళ.. హరీశ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

టీడీపీ.. సీపీఎం.. కాంగ్రెస్ లు రైతుల్నిరెచ్చగొడుతున్నాయని..మెదక్ జిల్లాలో ఇచ్చిన బంద్ పిలుపు విఫలమైనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బంద్ స్పష్టంగా విఫలమైనట్లు కనిపించిందన్న హరీశ్.. ఎనిమిది ముంపు గ్రామాల్లో ఆరు గ్రామాల వారు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రాజెక్టులను అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రతిపక్షాల పనిగా ఉందని వ్యాఖ్యానించారు.

ఒకవేళ హరీశ్ మాటలే నిజం అనుకుంటే.. ఆదివారం జరిగిన పోలీసుల లాఠీ చార్జ్ లో దాదాపు ఐదుగ్రామాలకు పైగా ప్రజానీకం రోడ్ల మీదకు రావటం దేనికి నిదర్శనం. ఓపక్క బంద్ సాగుతుంటే.. మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే ప్రెస్ మీట్ పెట్టేసి బంద్ విఫలమైందని చెప్పటం దేనికి నిదర్శనం అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మెదక్ జిల్లా బంద్ కు ప్రజల మద్ధతు లేదని చెప్పిన హరీశ్.. విపక్షాల మీద విరుచుకుపడిన తీరు చూసినప్పుడు.. ఆయన డిఫెన్స్ లో పడినట్లుగా కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హరీశ్ చెబుతున్న మాటలే నిజమైనపక్షంలో గడిచిన పాతిక నెలల్లో మరే ఇష్యూ మీద జరగనంత రచ్చ మల్లన్నసాగర్ మీదనే ఎందుకు జరుగుతుంది? విపక్షాలు సైతం ఈ ఇష్యూ మీదనే ఎందుకు పోరాడగలుగుతున్నాయి? అన్నవి ప్రశ్నలు. ప్రజల మద్దతు లేకుండా.. తెలంగాణలోని విపక్షాలు ఇంత బలంగా పోరాడే పరిస్థితి లేని నేపథ్యంలో.. ఈ ఇష్యూను సానుకూలంగా ఎలా పూర్తి చేయాలన్న అంశం మీద హరీశ్ దృష్టిపెడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.