Begin typing your search above and press return to search.

ఏపీ ప్రాజెక్టుల అనుమతుల గురించి హరీశ్ ప్రశ్న

By:  Tupaki Desk   |   29 May 2016 1:49 PM GMT
ఏపీ ప్రాజెక్టుల అనుమతుల గురించి హరీశ్ ప్రశ్న
X
ప్రశ్నకు సమాధానం కామన్. కానీ.. ప్రశ్నకు తిరిగి ప్రశ్నను సంధించటం నేటి రాజకీయాల్లో ఒక అలవాటుగా మారింది. తెలంగాణ సర్కారుపై ఏపీ అధికారపక్ష నేతలు సంధించిన ప్రశ్నాస్త్రాలకు సూటిగా సమాధానం చెప్పని తెలంగాణ మంత్రి హరీశ్ రావు.. తిరిగి ఎదురు ప్రశ్నలు వేసి టార్గెట్ చేశారు. తెలంగాణ సర్కారు చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల విషయంలో బాబు.. కేసీఆర్ సర్కార్ల మధ్య రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు చేపట్టిన నూతన ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవంటూ విమర్శలు చేస్తున్నారు.

ఏపీ అధికారపక్ష నేతలు చేస్తన్న విమర్శలపై ఇంతకాలం మౌనంగా ఉన్న తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తాజాగా రియాక్ట్ అయ్యారు. మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని పర్యవేక్షించిన ఆయన.. ఏపీ సర్కారు తీరుపై విమర్శలు సంధించటమే కాదు.. కొన్ని ప్రశ్నల్ని వేశారు. తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నట్లుగా చెప్పిన హరీశ్.. ఏపీ సర్కారు నిర్మించిన పోతిరెడ్డిపాడు.. పట్టిసీమ.. హంద్రీనీవా ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను మాత్రమే తాము కడుతున్నట్లుగా చెప్పిన హరీశ్.. పాలిటిక్స్ కోసం ప్రాజెక్టుల్ని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారంటూ మండిపడ్డారు. తమ ప్రాజెక్టు మీద వ్యక్తం చేసిన సందేహాలకు సూటి సమాధానం చెప్పని హరీశ్.. ఏపీ సర్కారుపై ఎదురుదాడి తిరిగిన నేపథ్యంలో.. ఏపీ అధికారపక్ష నేతలు ఎలా రియాక్ట్ అవుతారో..?