Begin typing your search above and press return to search.

హరీశ్ చేసింది సూచనా.. హెచ్చరికా?

By:  Tupaki Desk   |   6 May 2016 7:04 AM GMT
హరీశ్ చేసింది సూచనా.. హెచ్చరికా?
X
ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మద్య రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త మాటల యుద్ధాన్ని షురూ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం ఏపీ అధికార.. విపక్ష నేతలు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ అధికారపక్షం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ మీదా.. ఏపీ ప్రజల మీద హరీశ్ చేసిన వ్యాఖ్యలు సూచనతో కూడిన హెచ్చరికలా ఉండటం గమనార్హం.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వివాదం పెట్టుకుంటే నష్టపోయేది ఏపీ ప్రజలేనని చెబుతున్నారు హరీశ్ రావు. అయితే.. ఏపీ ప్రజలు ఎలా నష్టపోతారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పని హరీశ్.. హెచ్చరిక ధోరణతోవ్యాఖ్యలు చేయటం గమనార్హం. తమ నీళ్లు తాము దక్కించుకోవటం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామే తప్పించి ఆంధ్రప్రదేశ్ నీటి కోసం కాదన్నారు. కృష్ణా జలాల్లో 293 టీఎంసీల మిగులు జిలాలు.. 77 నికర జలాలపై హక్కులు ఉన్నాయని.. ఏ ప్రాజెక్టులు నిర్మించిన తెలంగాణకు కేటాయించిన నీటి జలాల్లోనే నిర్మిస్తున్న సంగతిని స్పష్టం చేశారు.

హరీశ్ రావు చెప్పింది నిజమే అని అనుకుంటే.. తెలంగాణకు కేటాయించిన నీటిలోనే ప్రాజెక్టులు కట్టుకుంటున్న మాట వాస్తవమే అయితే.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కృష్ణా యాజమాన్య బోర్డు నుంచి ఎందుకు అనుమతులు తీసుకోవటం లేదన్నది పెద్ద ప్రశ్నగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కోర్టుకు వెళితే తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్న హరీశ్.. అదే మాట మీద అంత నమ్మకమే ఉంటే ఏపీ సర్కారుకు.. ఏపీ ప్రజలకు వార్నింగ్ ఇచ్చే తీరులో వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి.