Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ - టీడీపీ పొత్తుపై హ‌రీశ్ రావు క‌న్ను

By:  Tupaki Desk   |   27 May 2017 5:22 AM GMT
కాంగ్రెస్‌ - టీడీపీ పొత్తుపై హ‌రీశ్ రావు క‌న్ను
X
ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే తెలంగాణలో పొలిటిక‌ల్ పార్టీల పొత్తు పొడుపు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను ఎదుర్కునేందుకు విప‌క్షాలు ఐక్య‌త‌రాగం ఆల‌పిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ‌ టీడీపీ కార్యనిర్వాహక‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ను ఒంటరి చేసేందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర పక్షాలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి సమర్థిస్తూ మాట్లాడారు. దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ టీడీపీల పొత్తు ఖ‌రారు అయింద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

రాజ‌కీయ సిద్ధాంతాల ప‌రంగా బ‌ద్ద‌శ‌త్రువులైన కాంగ్రెస్‌, టీడీపీలు పొత్తుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు రాష్ట్ర ఇరిగేషన్‌, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌ రావు రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే...అంతకంటే ఆత్మహత్యాసదృశం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. ఒక‌వేళ అదే జరిగితే త‌మ‌ నెత్తిన పాలు పోసినట్టేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీడీపీతో జతకడితే కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీ గానే ప్రజలు చూస్తారని హ‌రీశ్ రావు విశ్లేషించారు. ఈ స్వార్థ‌పు పొత్తుల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ఆయా పార్టీల‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన రీతిలో స‌మాధానం చెప్తార‌ని హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు.

కాగా పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై విమ‌ర్శ‌లు చేసిన బీజేపీ నేత‌, మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డిపై హ‌రీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ నాయకుడినని చెప్పుకుంటున్న నాగం జనార్దన్‌ రెడ్డి శిఖండి అని విమ‌ర్శించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకోవడానికి కుట్రలు మీద కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. నాగం వేసిన కేసును విచారించిన కేసును హైకోర్టు చీవాట్లు పెట్టినా ఆయనకు బుద్ధి రాలేదన్నారు. నాగం ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకైనా తెలుసా అని ఎద్దేవా చేశారు. నేతిబీరకాయలో నెయ్యి ఉండదు. నాగం మాటల్లో నిజం ఉండదు అని వ్యాఖ్యానించారు. కుల వృత్తులను పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే, పందులు, కుక్కలు, నక్కలు అంటూ బడుగు బలహీన వర్గాలను నాగం ఘోరంగా అవమానించారని హ‌రీశ్ రావు అన్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు చేతివృత్తులకు క్షమాపణ చెప్పాలని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారని, తమ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ముందుకు సాగుతున్నామ‌ని హ‌రీశ్ రావు వివ‌రించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/