Begin typing your search above and press return to search.

తల్చుకుంటే లోప‌ల వేసేస్తామంటున్న హ‌రీశ్

By:  Tupaki Desk   |   26 Feb 2017 5:03 AM GMT
తల్చుకుంటే లోప‌ల వేసేస్తామంటున్న హ‌రీశ్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ఒకింత గ్యాప్ త‌ర్వాత త‌న‌లోని మాస్ రాజాను తెర‌మీద‌కు వ‌చ్చారు. టీఆర్‌ ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో నిర్మాణంలో ఉన్న‌ ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తూ రైతులకు సాగునీరు ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కడుపుమంట రేగుతోందని హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి కేసులు వేసి ప్రభుత్వానికి ఇబ్బందులు తేవాలని చూస్తుంటే కూడా తాము సహనం వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టడం పెద్దపనేమీ కాదని, తాము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని హెచ్చరించారు. తాము రాజకీయాలు చేయదలుచుకోలేదని, కాంగ్రెస్ నాయకులపై కేసులు మోసి జైళ్లకు పంపాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. అయితే వారు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని, అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఎప్పుడో ఓసారి వారి పాపం పండక తప్పదని ఆయన ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు చేశారు.

జలయజ్ఞంలో కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుల్లో చేసిన అవినీతి చాలా ఉందని, పనులు చేయకుండానే ఈపీసీ విధానాన్ని తెచ్చి వందల కోట్ల రూపాయలు దండుకుని ప్రజాధనాన్ని లూటీ చేశారని మంత్రి హ‌రీశ్ రావు ఆరోపించారు. తెలంగాణలో 32 ప్రాజెక్టులలో కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, వాటిని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టి, వారి బండారాన్ని బట్టబయలు చేస్తానని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం ఉండడం ప్రజల దురదృష్టమని హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిపై ప్రజలు సైతం విసుగుచెందుతున్నారని ఆయన అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌ నగర్‌ కు విచ్చేసిన హ‌రీశ్ రావు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్ ఇంట్లో విలేఖరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటిన మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని, అదే తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్‌ ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో సింగూరు ప్రాజెక్టు నుండి 30 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమదని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టు మంజూరు కాకుండానే నిధులు నొక్కేశారని, దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులు చేపట్టకుండానే దాదాపు రూ.800 కోట్లు డ్రా చేసుకుని అవినీతికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ ఎస్ పార్టీని విమర్శించడమంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టం అభివృద్ధికి అడ్డంకిగా మారిందని, కేంద్రంలో సైతం దీనిని సవరించే ప్రయత్నం జరుగుతుంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డంపడుతోందని ఆయన ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేస్తున్నానని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దామని, ఎవరేంతపని చేశారో ఎవరెంత దోపిడీ చేశారో తేల్చుకుందామని మంత్రి హరీష్‌ రావు సవాల్ విసిరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/