Begin typing your search above and press return to search.

రావ‌ణాకాష్టంలా గుజ‌రాత్

By:  Tupaki Desk   |   27 Aug 2015 9:30 AM GMT
రావ‌ణాకాష్టంలా గుజ‌రాత్
X
గుజరాత్‌ రావణకాష్టంలా మండుతోంది. రిజర్వేషన్ల కోసం పటేళ్లు సాగిస్తున్న పోరాటం... హింసకు దారితీయడం తీవ్ర కలకలం రేపింది. అల్లర్లలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మ‌రోవైపు గుజ‌రాత్ హోంమంత్రి ర‌జ‌నీ ప‌టేల్ ఇంటికి కొంద‌రు నిప్పుపెట్టారు. దీంతో శాంతి భద్రతలు అదుపు చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు.

పటేళ్ల సామాజిక వర్గానికి OBC కోటాలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ తో మొదలైన ఈ ఉద్యమం... అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. ఆ సామజిక‌వ‌ర్గానికి చెందిన వారు ఎక్కువ‌గా ఉండే రాజ్‌ కోట్‌, సూరత్, అహ్మదాబాద్‌ తో పాటు ప్రధాన పట్టాణాల్లో ఆందోళన కారులు రెచ్చిపోయారు. బస్సుల్ని, కార్లను అడ్డుకుని తగలబెట్టారు. బస్టాపులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పుపెట్టారు. నిరసనకారుల విధ్వంసంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల తీవ్ర స్థాయిలో లాఠీ చార్జీ జరిగింది. పదుల సంఖ్యలో జనానికి గాయాలయ్యాయి. పరిస్థితుల్ని కంట్రోల్‌ చేయడానికి భారీగా బలగాల్ని రంగంలోకి దించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్నిచోట్ల కర్ఫ్యూ, 144 సెక్షన్‌ ను విధించారు.

అయితే...లాఠీ ఛార్జి చేయమని తాను పోలీసులకు ఆదేశించలేదని సీఎం ఆనందిబెన్ పటేల్ తెలిపారు. ప్రభుత్వమే లాఠీ ఛార్జికి ఆదేశించిందన్న వ్యాఖ్యలను ఆమె కొట్టిపడేశారు. సుప్రీంకోర్టు తీర్పుల దృష్ట్యా పటేల్ వర్గీయులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని గుజరాత్ సీఎం చెప్పడంతో ఈ ఉద్యమం తీవ్రంగా మారింది.

తమను వెనుకబడిన కులాల్లో చేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపిస్తామని... పటేళ్ల నాయకుడు, 22 ఏళ్ల కుర్రాడు హార్ధిక్ పటేల్ హెచ్చరించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు దక్కేవరకు తమ పోరాటం ఆగదన్నాడు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ గుజరాత్‌ లో రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న పటేల్ కులస్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు. పటేళ్లకు రిజర్వేషన్ల కోసం వారితో కలిసి తామూ పోరాటం చేస్తామని లాలూ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.