Begin typing your search above and press return to search.

చెత్త వ్యాఖ్య‌లు చేసిన రాహుల్.. పాండ్యాల‌కు భారీ ఫైన్!

By:  Tupaki Desk   |   20 April 2019 10:53 AM GMT
చెత్త వ్యాఖ్య‌లు చేసిన రాహుల్.. పాండ్యాల‌కు భారీ ఫైన్!
X
ప్ర‌ముఖులన్న ట్యాగ్ ఉన్న వారు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. త‌మ స్థానాన్ని.. స్థాయిని మ‌రిచి వ్యాఖ్య‌లు చేస్తే ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌న్న విష‌యాన్ని టీమిండియా క్రికెట‌ర్లు కేఎల్ రాహుల్.. హార్దిక్ పాండ్యాల‌కు ఇప్ప‌టికే అర్థ‌మైంది. ఈ మ‌ధ్య‌న కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో పాల్గొన్న ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లు.. చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం కావ‌ట‌మే కాదు.. తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

దీంతో.. వారిపై బీసీసీఐ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉంటే.. వీరు చేసిన చెత్త వ్యాఖ్య‌ల‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీకే జైన్ వారిద్ద‌రికి చిత్ర‌మైన శిక్ష‌ల్ని వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. బీసీసీఐ అంబుడ్స్ మెన్ గా వ్య‌వ‌మ‌రిస్తున్న జైన్ తాజాగా వారికి తాను వేసిన శిక్ష‌ల్ని వెల్ల‌డించారు.

యువ‌త‌కు ఆద‌ర్శంగా నిల‌వాల్సిన క్రికెట‌ర్లు త‌మ హోదాకు త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌కుండా చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ వారిని ఆస్ట్రేలియా టూర్ నుంచి వెన‌క్కి ర‌ప్పించ‌టం కార‌ణంగా రూ.30ల‌క్ష‌లు కోల్పోయిన‌ట్లు చెప్పారు. ఇప్ప‌టికే వారు చేసిన ప‌నికి సారీ చెప్పార‌ని.. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రు చెరో ల‌క్ష రూపాయిల చొప్పున విధుల్లో అమ‌రులైన ప‌ది మంది పారామిల‌ట‌రీ కానిస్టేబుళ్ల కుటుంబాల‌కు ఇవ్వాల‌ని పేర్కొంది.

అంతేకాదు.. అంధుల క్రికెట్ సంఘానికి చెరో రూ.10ల‌క్ష‌లు చొప్పున నిధులు స‌మీక‌రించాల‌ని ఆదేశించింది. ఈ మొత్తాల్ని చెల్లించ‌టానికి వీరికి నాలుగు వారాల గ‌డువును ఇచ్చింది. ఒక‌వేళ అంబుడ్స్ మెన్ ఇచ్చిన ఆదేశాల్ని స‌కాలంలో అమ‌లు చేయ‌కుంటే వారిద్ద‌రి మ్యాచ్ ఫీజుల్లో నుంచి స‌ద‌రు మొత్తాన్ని మిన‌హాయించాల్సి వ‌స్తుంద‌ని పేర్కొంది. మాట జారితే భారీ మూల్యం చెల్లించాల్సిన విష‌యం ఈ ఇద్ద‌రితో పాటు.. మిగిలిన ప్ర‌ముఖుల‌కు అర్థ‌మైన‌ట్లేనా?