ఈ మాంఝీ ఇంటికి రోడ్డు వేసుకున్నాడు

Thu Jan 12 2017 15:12:27 GMT+0530 (IST)

భార్య కోసం బీహార్‌లో కొండను పిండి చేసిన మాంఝీ ఉదంతం మీకు గుర్తుండే ఉంటుంది.  అలాంటిదే ఒక స్పూర్తిదాయకమైన అదే సమయంలో చెంపపెట్టు లాంటి సంఘటన ఇది. పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డుకాదని మరోసారి రుజువు చేశాడు తిరువనంతపురానికి చెందిన శశి. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. ఇంటివరకు రోడ్డు వేయండి అని విజ్ఞప్తి చేసినా పట్టించుకొని వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తూ మూడేండ్లు కష్టపడి స్వయంగా ఇంటివరకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. తద్వారా తనను చీత్కరించిన వారికి చెంపదెబ్బ కొట్టినం పనిచేశాడు. నడువలేని నీకు రోడ్డు ఎందుకు అని అవమానించిన గ్రామపంచాయతీ అధికారులకు శశి గుణపాఠం చెప్పారు. అంతేకాకుండా పలువురికి స్ఫూర్తిగా కూడా నిలిచారు.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన శశి 18 ఏళ్ల క్రితం కొబ్బరి చెట్టు మీద నుంచి పడటంతో శరీరంలోని ఎడమ భాగం చచ్చుబడింది. దాంతో చాలా రోజులు మంచానికే పరిమితమై తర్వాత కొద్దికొద్దిగా నడవడం ప్రారంభించారు. తన జీవనోపాధి కోసం చిన్న వ్యాపారం చేసుకొనేందుకు ఉపయోగపడే విధంగా ఓ రిక్షాను సహాయంగా అందించాలని ఇంటి సమీపం వరకు రోడ్డును నిర్మించాలని గ్రామపంచాయతీ అధికారులను అభ్యర్థించారు. సరిగా నడులేనందున వాహనం ఇవ్వడం కుదరదని ముఖం మీదే చెప్పారు. రోడ్డు ఏర్పాటు గురించి ఆలోచిస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. దాంతో శరీరం సహకరించకపోయినా పలుగు - పార చేతబట్టి ప్రతీరోజు ఆరుగంటలపాటు ఎత్తైన గుట్టను తవ్వడం ప్రారంభించానని శశి తన అనుభవాన్ని వివరించారు. దాదాపు మూడేళ్ల శ్రమ ఫలితంగా 200 మీటర్ల పొడవైన రోడ్డును ఏర్పాటు చేయగలిగానని పేర్కొన్నారు. శశి పడిన కష్టాన్ని వివరిస్తూ ఆయన భార్య కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు తవ్వే క్రమంలో ఆయనకేమైనా అయితే వైద్య చికిత్సకు డబ్బులు ఎలా అనే భయం వెంటాడేదని ఆమె తెలిపారు. ఇప్పుడు తయారైన రోడ్డు గురించి అందరూ మాట్లాడుతున్నారని మా ఆర్థిక పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

ప్రభుత్వం చీత్కారించినా తన సత్తాతో ప్రపంచానికి విజయం పాఠాలు నేర్పి మరో మాంఝీ అనిపించుకున్న శశి ఉదంతం పోరాట పటిమకు నిదర్శనం అంటున్నారు.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/