Begin typing your search above and press return to search.

సీఎం పీఠం వ‌దిలేస్తా..కుమార‌స్వామి క‌న్నీరు

By:  Tupaki Desk   |   15 July 2018 5:03 PM GMT
సీఎం పీఠం వ‌దిలేస్తా..కుమార‌స్వామి క‌న్నీరు
X
సీఎం పదవి అంటే ఎవరికి ఇష్టముండదు - కానీ కర్నాటక సీఎం కుమారస్వామికి మాత్రం తనకు గొంతులో గరళాన్ని దాచుకున్నట్లు ఉందంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం నడపడం అంత సులువు కాదని, ప్రజల కోసం ఎంతో చేస్తున్నప్పటికీ.. వారి మద్దతు పొందలేకపోతున్నానని కన్నీరు పెట్టుకున్నారు. బెంగళూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో తన పరిస్థితి చెప్పుకుంటూ.. భోరున విలపించారు. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం జనతాదళ్‌ కార్యకర్తలకు మాత్రమే సంతోషమని - తనకు మాత్రం కాదన్నారు. రైతు రుణమాఫీ కోసం డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్ధం కావడం లేదని - అందుకే పన్నుల భారం మోపినట్లు చెప్పారు కుమారస్వామి. సంకీర్ణ ప్రభుత్వంలో గరళాన్ని మింగిన శివుడిలా నా పరిస్థితి తయారైందంటూ కన్నీరు పెట్టుకున్నారు. సీఎం క‌న్నీరు పెట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

బెంగళూరులో ఆదివారం జేడీఎస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కుమారస్వామి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. వేదికపైకి వెళ్లేముందు పుష్పగుచ్ఛాలు - పూలదండలు స్వీకరించేందుకు కూడా ఆయన నిరాకరించారు. ‘మీ తమ్ముడో - అన్నో ముఖ్యమంత్రి అయినట్లుగా మీరంతా సంతోషిస్తున్నారు కానీ - నేను మాత్రం ఆనందంగా లేను. సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు నన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఎందుకు అనేది మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా..’ అని కుమారస్వామి ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో సభలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది. ‘సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఎంత బాధాకరమో నాకు తెలుసు. నేను ప్రతిరోజూ ఆ బాధను భరిస్తున్నాను. శివుడు విషాన్ని కంఠంలో దాచుకున్నట్లు.. నేను సంకీర్ణ ప్రభుత్వ గరళాన్ని దిగమింగుకుంటున్నాను’ అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘రైతుల రుణమాఫీపై అధికారులను ఒప్పించడానికి నెలరోజులుగా నేను ఎన్ని తిప్పలు పడ్డానో ఎవరికీ తెలియదు. ‘అన్న భాగ్య’ పథకం కింద ఇప్పుడు ఐదుకిలోల బియ్యానికి బదులుగా ఏడు కిలోల బియ్యం కావాలని అడుగుతున్నారు. కానీ, అందుకు అయ్యే రూ.2500 కోట్లు నేను ఎక్కడినుంచి తీసుకురావాలి? పోనీ పన్నుల రూపంలో వసూలు చేద్దామాఅంటే తిరిగి ప్రభుత్వాన్నే నిందిస్తారు. ఇక మీడియా అయితే.. రుణమాఫీపై సంతకం కూడా అయిపోయినా ఆ విషయంలో సీఎంకే స్పష్టత లేదంటూ కథనాలు ప్రచురిస్తున్నది’ అని ఆయన వాపోయారు. తన వల్ల కాదనుకుంటే రెండు గంటల్లో రాజీనామా చేసేందుకైనా తాను సిద్ధమేనని ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, తాను సీఎం పదవిని అంగీకరించింది కేవలం రాష్ట్ర ప్రజలకు సేవచేసేందుకే తప్ప వేరేదానికి కాదని, తనకు అధికారంపై యావ లేదని కుమారస్వామి చెప్పారు. తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ కొనసాగించలేకపోయిన కార్యక్రమాలను పూర్తి చేయాలన్నది తన కల అని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తానెక్కిడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని, కానీ తన పార్టీకి మాత్రం ఓట్లేయడం మర్చిపోయారని పేర్కొన్నారు. ‘నాకు ఈ అధికారాన్ని దేవుడే ఇచ్చాడు. అయితే ఎన్నిరోజులు సీఎం పదవిలో ఉండాలనేది కూడా ఆయనే నిర్ణయిస్తాడు’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కంటతడి పెట్టడంపై ఆందోళనకు గురైన కార్యకర్తలు.. ‘మీ వెంటే మేమున్నాం’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు కుమారస్వామి వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత జీ పరమేశ్వర స్పందిస్తూ.. ‘ఆనందంగా లేనని ఆయన ఎలా చెబుతారు? ముఖ్యమంత్రి ఎప్పుడూ సంతోషంగా ఉండాల్సిందే. అలా ఉంటేనే, మిగతా మేమంతా సంతోషంగా ఉంటాం’ అని పేర్కొన్నారు.