Begin typing your search above and press return to search.

హైకోర్టులో ర‌జ‌నీ స‌తీమ‌ణికి ఎదురుదెబ్బ‌

By:  Tupaki Desk   |   22 Nov 2017 6:20 AM GMT
హైకోర్టులో ర‌జ‌నీ స‌తీమ‌ణికి ఎదురుదెబ్బ‌
X
త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌తీమ‌ణి ల‌తా ర‌జ‌నీకాంత్‌కు తాజాగా మ‌ద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె న‌డుపుతున్న ట్రావెల‌ర్స్ సంస్థ షాపు అద్దెకు సంబంధించిన కేసులో ఆమె దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ ను కోర్టు కొట్టేసింది. ర‌జ‌నీ స‌తీమ‌ని ల‌తా ర‌జ‌నీకాంత్ ట్రావెల‌ర్స్ సంస్థ‌ను న‌డుపుతున్నారు. దీనికి సంబంధించిన కార్యాల‌యాన్ని చెన్నై కొర్ప‌రేష‌న్ ఆధ్వ‌ర్యంలోని అళ్వారుపేట‌లోని షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్వ‌హిస్తున్నారు.

కొన్నేళ్లుగా ఆమె ఈ షాపు అద్దె కింద నెల‌కు రూ.3702 చెల్లిస్తున్నారు. అయితే.. గ‌త ఏడాది జూన్ లో ఈ షాపు అద్దెను రూ.21,160కు పెంచుతూ కార్పొరేష‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఒకేసారి ఇంత అద్దెను ఎలా పెంచుతారంటూ ఆమె హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనికి సంబంధించిన విచార‌ణ న్యాయ‌మూర్తి వైద్య‌నాథ‌న్ ఎదుట జ‌రిగింది.

పెద్ద నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ కార‌ణంగా ట్రావెల్స్ వ్యాపారం తీవ్రంగా దెబ్బ తిన్న‌ద‌ని.. ఇంత భారీగా అద్దె పెంచితే క‌ష్ట‌మ‌ని ల‌తా ర‌జ‌నీ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. కార్పొరేష‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదిస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వు ప్ర‌కారం ప్ర‌తి తొమ్మిదేళ్ల‌కు ఒక‌సారి అద్దెకు ఇచ్చిన కార్పొరేష‌న్ భ‌వ‌నాల అద్దెను పెంచాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ల‌తా ర‌జ‌నీ న‌డుపుతున్న దుకాణం అద్దెను సైతం ఈ చట్టం ప్ర‌కారం పెంచిన‌ట్లు పేర్కొన్నారు. చ‌ట్టంలో పేర్కొన్న రీతిలోనే అద్దె పెంపు జ‌రిగిందన్నారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి ల‌తా ర‌జ‌నీకాంత్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టి వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.