Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ వీసా..భార‌తీయుల‌కు గుడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   27 May 2017 4:54 PM GMT
హెచ్‌1బీ వీసా..భార‌తీయుల‌కు గుడ్ న్యూస్‌
X
అమెరికా అంటేనే బెంబేలెత్తిపోయే వార్త‌లు వ‌స్తున్న స‌మ‌యంలో అనూహ్య‌మైన తీపిక‌బురు వినిపించింది. అది కూడా విద్యార్థుల‌కు పెద్ద ఎత్తున ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త కావ‌డం విశేషం. ఇంత‌కీ ఆ వార్త ఏమంటే హెచ్‌1బీ వీసాల విష‌యంలో మ‌న విద్యార్థుల‌కు మేలు చేసే బిల్లును కాంగ్రెస్‌ లో ప్ర‌వేశ‌పెట్ట‌డం. కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సన్ - మైక్ క్విగ్లిలు ''లీవింగ్ ది ఎకానమీ యాక్ట్(స్టాపల్)'' పేరుతో కొత్త బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. హెచ్‌1బీ వీసాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భావితం చేసే ఈ బిల్లు ద్వారా భార‌తీయ విద్యార్థుల‌కు పెద్ద ఎత్తున మేలు చేస్తుంద‌ని అంటున్నారు.

ప్ర‌తినిధుల స‌భ‌ స‌భ్యులు అయిన ఈ ఇద్ద‌రు అమెరిక‌న్ నాయ‌కులు ప్ర‌వేశ‌పెట్టిన బిల్లులో అమెరికా యూనివర్సిటీల నుంచి సైన్సు - టెక్నాలజీ - ఇంజనీరింగ్ - మాథమ్యాటిక్స్ ల్లో పీహెచ్.డీ పొందిన విదేశీయులను ఉద్యోగ ఆధారితంగా ఇచ్చే గ్రీన్ కార్డులు - హెచ్ 1బీ వీసాల కఠినతరమైన నిబంధనల నుంచి మినహాయించాలని కోరారు. ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన ఎరిక్ పాల్స‌న్ ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికాకు తెచ్చుకోవడంలో ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసి, శిక్ష‌ణ పొందిన‌ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఉపయోగపడేలా ఉండేందుకే తాము ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఎరిక్ చెప్పారు. దేశంలో ఉన్న వేలకొద్ది ప్రతిభావంతులైన ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదని, స్టాపల్ యాక్ట్ తో కంపెనీలకు అవసరమైన నిపుణులను పొందవచ్చని విశ్లేషించారు.

మ‌రో స‌భ్యుడైన క్విగ్లీ మాట్లాడుతూ ఈ బిల్లు అమెరికా మేలుకోస‌మేని అన్నారు. కొత్త కొత్త ఆవిష్కరణలను, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లో పోటీదారుడిగా నిలవాలంటే, కచ్చితంగా ప్రపంచంలో ఉన్న చురుకైన విద్యార్థులకు దేశంలో చదువుకునేలా, పనిచేసేలా ప్రోత్సహించాల్సి ఉందని అన్నారు. అందుకోస‌మే తాము ఈ బిల్లు ప్రవేశ‌పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం కాకుండా కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ట్రంప్ గ‌త నెల‌లో తీసుకురాగా...ప్ర‌తినిధుల స‌భ్యులు ఈ బిల్లు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది. భారీ సంఖ్య‌లో భారతీయ విద్యార్థులు అమెరికాలో పీహెచ్‌డీలు పొందుతున్న నేప‌థ్యంలో ఈ బిల్లు ద్వారా మ‌న‌ విద్యార్థులకు లబ్ది ద‌క్క‌నున్న‌ట్లు విశ్లేష‌కులు చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/