హెచ్1బీ దెబ్బ ఐటీ జాబ్స్ తోనే ఆగిపోవట్లేదు!

Wed Jan 11 2017 11:24:39 GMT+0530 (IST)

అమెరికాపై ఆశలు పెట్టుకున్న వారికి మరో దుర్వార్త. ఇప్పటివరకు ఐటీ ఉద్యోగుల మీదనే దృష్టి పెట్టిన అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఐటీయేతర ఉద్యోగుల పైనా నజర్ వేశారు. ఐటీ ఉద్యోగులతో పాటు మార్కెట్ రిసెర్చ్ అనలిస్టులు - ఆర్థిక సలహాదారులు - వెబ్ డెవలపర్లు - టీచర్లు - కళాకారులు - వైద్య విద్యార్థులు - పారా మెడికల్ విద్యార్థుల అమెరికా కల ఇకపై అంత సులభతరం కాదు. ఎందుకంటే.. కాంగ్రెస్ ప్రతిపాదించిన కొత్త బిల్లు వీరందరిపై ప్రభావం చూపనుంది. కొత్త బిల్లు ప్రకారం అమెరికాలో ఉద్యోగాలు చేయాలంటే ఇకనుంచి లక్ష డాలర్ల వరకు సంపాదించాలి. పైన పేర్కొన్న ఉద్యోగులందరూ సాధారణంగా 60000 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు సంపాదిస్తారు. కొత్త బిల్లు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇకపై వీరందరూ లక్ష డాలర్ల వరకు సంపాదించాలి. మాస్టర్స్ డిగ్రీ మినహాయింపును కూడా ఈ బిల్లు తొలగించింది.

వలస ఉద్యోగులను నిలువరించేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ తో ఐటీ ఉద్యోగులు మాత్రమే కాక ఇతర ఉద్యోగులూ తీవ్రంగా ప్రభావితం అవుతారని నిపుణులు చెప్తున్నారు. "ఐటీ ఉద్యోగులు సులభంగా లక్ష డాలర్లు సంపాదిస్తారు. టీచర్లు - లెక్చరర్లకు చాలా తక్కువ జీతాలు ఇస్తారు. ఇతర దేశాల నుంచి వచ్చే టీచర్లపై అమెరికా విద్యా వ్యవస్థ చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. ఐటీయేతర ఉద్యోగుల బాధలను కూడా పట్టించుకోవాలి" అని వలసవచ్చిన లాయర్ (ఇమ్మిగ్రేషన్ లాయర్) అను పెషావరి పేర్కొన్నారు. 'నేను ఎఫ్1 వీసా విద్యార్థిని. నా లాంటి అభ్యర్థులను తీసుకునే కంపెనీలకు అంతర్గత నియమాలు ఉన్నాయి. బయటివాళ్లను తీసుకోవడానికి వారు అంత ఆసక్తి చూపలేదు' అని కొలంబియా జర్నలిజం యూనివర్సిటీలో ఉత్తీర్ణురాలైన శ్రావ్య జైన్ తెలిపారు. అడ్వొకసీ సంస్థ నెక్సస్‌లో ఆమె సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఆమెకు ఆరునెలల ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేయడానికి వీసా ఇచ్చింది.

తాజాగా ప్రవేశపెట్టిన బిల్లుతో ఎల్1 - ఈబీ5 వీసాకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగవచ్చని ఇమ్మిగ్రేషన్ లాయర్లు తెలిపారు. కళలు - సంగీతం - విద్య - సైన్స్ - క్రీడలు - తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభ ఉన్నవారు ఓ1 క్యాటగిరీ కింద కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వారు చెప్పారు. ఎల్1 - ఈబీ5 కింద చాలా మంది తన క్లయింట్లు వీసాల కోసం దరఖాస్తు చేస్తున్నారని అమెరికా - యూకేలో పనిచేసే ఇమ్మిగ్రెంట్ లాయర్ మార్క్ డేవిస్ పేర్కొన్నారు. డబ్బుంటే ఈబీ5 వీసాను సులభంగా ఇస్తారని ఆయన తెలిపారు. ఎల్1 కింద వీసా పొందాలనుకుంటే వెంటనే అసాధారణ ప్రతిభ చూపాలని ఆయన పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న భారతీయ చెఫ్‌లకు వీసా పొందడంలో వారికి తాను సాయం చేశానని డేవిస్ చెప్పారు. నైపుణ్యం ఉన్న వారిని మాత్రమే ట్రంప్ విధానాలు ప్రభావితం చేస్తాయని అసాధారణ నైపుణ్యం ఉన్నవారు-భారీగా పెట్టుబడులు పెట్టేవారిపై ప్రభావం చూపవని లాయర్లు చెప్తున్నారు. అమెరికాకు వచ్చే పెట్టుబడులను ట్రంప్ ఆహ్వానిస్తారని పారిశ్రామికవేత్తలతో ఆయన ఎప్పుడూ స్నేహంగా ఉంటారని విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/