Begin typing your search above and press return to search.

నాక‌న్నా బొద్దింక‌కే అదృష్టం ఎక్కువ‌:ఏసుదాస్

By:  Tupaki Desk   |   25 March 2018 4:41 AM GMT
నాక‌న్నా బొద్దింక‌కే అదృష్టం ఎక్కువ‌:ఏసుదాస్
X

ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప గాయ‌కుల‌లో కే.జే. ఏసుదాస్ ఒక‌రు. ఆయ‌న గ‌ళం నుంచి ఎన్నో మ‌ధుర గీతాలు జాలువారాయి. ఏసుదాస్ గాత్రానికి నేటిత‌రం యువ‌తలో కూడా విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. అటువంటి దిగ్గ‌జ గాయ‌కుడికి ఎన్నో అవార్డులు....మ‌రెన్నో రివార్డులు....ఇంకెన్నో బిరుదులు. అయితే, ఈ గాన గంధ‌ర్వుడికి ఒక విష‌యంలో మాత్రం చాలా కాలం నుంచి అసంతృప్తి ఉంది. గ‌తంలో, ఏసుదాస్ కు దేశంలోని కొన్ని ప్ర‌ముఖ ఆల‌యాల్లో ప్ర‌వేశం క‌ల్పించ‌క‌పోవ‌డం ఆయ‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింది. తాజాగా, త‌న‌కు ఆల‌య ప్ర‌వేశం నిరాక‌రించడం పై ఏసుదాస్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ఏసుదాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను బొద్దింకను అయితే ఎంతో బాగుండేదని, అపుడైనా త‌న‌కు ఆల‌య ప్ర‌వేశం ద‌క్కేద‌ని ఆయ‌న ఉద్వేగ‌భ‌రితంగా మాట్లాడారు. ఎర్నాకులంలోని త్రిపునితురలో తన తండ్రి అగస్టీన్ జోసెఫ్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థ తరపున అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రోమన్ కేథలిక్ కుటుంబంలో పుట్టిన ఏసుదాస్ హైందవ సంప్రదాయాలనే పాటిస్తారు. మొద‌ట్లో ఏసుదాస్ కు దేశంలోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాల్లో ప్ర‌వేశం క‌ల్పించ‌డానికి నిరాకరించారు. ఆ త‌ర్వాత కొన్ని ఆల‌యాల్లోకి ఆయ‌న‌ను అనుమ‌తించారు. అయితే, శ్రీకృష్ణుడంటే అమితంగా ఇష్ట‌ప‌డే ఏసుదాస్ కు గురువాయూర్‌ లో ని దేవాల‌యంలోకి అనుమ‌తి నిరాక‌రించారు. అన్యమతస్థులకు ఆ ఆల‌యంలోకి ప్రవేశం లేకపోవడంతో ఏసుదాస్ నిరాశ చెందారు. దీంతో, ఆ దేవాలయం బయటే చాలాసార్లు శ్రీకృష్ణుడిపై భక్తిపాటలు పాడారు. ఈ నేప‌థ్యంలో, నిన్న జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఏసుదాస్ ఆ విషయం గురించి మాట్లాడారు. తాను బొద్దింకనో....మరే క్రిమికీటకాన్నో అయి ఉంటే గురువాయూర్ దేవాల‌యంలోకి సులువుగా ప్ర‌వేశించే అదృష్టం ద‌క్కేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు, ఈ ఏడాది ఏసుదాసుకు మలప్పురంలోని కదంపుళా దేవి దర్శనానికి కూడా అనుమతి లభించలేదు. తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలో విజయ దశమి సందర్భంగా ఏసుదాస్ కు ఆలయ ప్రవేశానుమ‌తి ల‌భించినా....ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించారు. అయితే, ఆ ఆల‌య ప్ర‌వేశం విష‌యంలో తాను తొందర పడదల్చుకోలేదని, దేవుడు పిలిచినప్పుడే వెళ్తానని ఏసుదాస్ అన్నారు.