Begin typing your search above and press return to search.

డేటింగ్ కి అడిగితే.. 2వేల మంది రెఢీ అన్నారు

By:  Tupaki Desk   |   21 Feb 2017 2:17 PM GMT
డేటింగ్ కి అడిగితే.. 2వేల మంది రెఢీ అన్నారు
X
ఈ హెడ్డింగ్ చూసి. .వెస్ట్రన్ కంట్రీస్ లో ఇలాంటివి కామనే కదా అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది అచ్చంగా మన దేశంలో జరిగిందే. ఏంటీ.. మన దేశంలో డేటింగ్ కి వస్తారా? అంటే.. రెండు వేల మంది రెఢీ అయ్యారా? అన్న విస్మయం అక్కర్లేదు. ఎందుకంటే..షాకులు మరిన్ని.. చదివే కొద్దీ తగులుతూనే ఉంటాయి మరి. ఇంతకీ.. ఇంత ఫాస్ట్ జనరేషన్ అమ్మాయిలు.. మన దగ్గర ఎక్కడున్నారంటారా? అక్కడికే వస్తున్నాం.

భారత ఐటీ పరిశ్రమకు సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే గుర్ గావ్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఇక్కడికి చెందిన షకుల్ గుప్తా అనే డబ్బులున్న ఆసామి (పెద్దవయస్కుడేం కాదు సుమి. కుర్రోడే)కి చిత్రమైన ఆలోచన వచ్చింది. ఫిబ్రవరి 14న అదేనండి.. ప్రేమికుల దినోత్సవం రోజున ఒక్క అమ్మాయితో సరదాగా గడిపితే ఏం బాగుంటుంది? కనీసం నలుగురైదుగురు అమ్మాయిలతో కలిసి వాలెంటైన్స్ డేను జరుపుకుంటే బాగుంటుంది కదా అనిపించింది.

మరింకేమీ ఆలస్యం చేయకుండా.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేశాడు. కాకుంటే కాస్త ఆసక్తికరంగా తన ప్రపోజల్ ను మార్చేశాడు. ‘నా వ్యాలెంటైన్ ఎవరవుతారు? నేను ఎవరో నా ప్రొఫైల్ చూడండి. మీకు నచ్చితే నాకు పోస్ట్ చేయండి’’ అంటూ తన డిటైల్స్ ఇచ్చేశాడు. డబ్బులున్న కుర్రాడు.. దానికి తోడు కాస్త వెరైటీగా ప్రపోజ్ తీసుకొచ్చాడు. అతగాడి ఆఫర్ చాలామంది అమ్మాయిల్ని ఆకట్టుకుంది. మొత్తంగా 2వేల మంది అమ్మాయిలు.. మేం రెఢీ అంటే మేం రెఢీ అనేశారు.

కావాల్సింది ఐదుగురు అయితే.. రెండు వేల మంది అమ్మాయిలు రెఢీ అనేసరికి.. మనోడు వచ్చిన ప్రపోజల్స్ ను ముందేసుకొని.. వాటిల్లో వడబోత కార్యక్రమాన్ని షురూ చేశారు. చివరకు ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే.. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి.. అబ్బాయిగారు అనుకున్న వ్యాలెంటైన్స్ డే కాస్తా అయిపోయింది. అయినా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఫిబ్రవరి 14నే ఎందుకు జరుపుకోవాలని అనుకున్నాడేమో కానీ.. తనదైన వెరైటీ వ్యాలెంటైన్స్ డే ను ఫిబ్రవరి 16న ఘనంగా జరుపుకున్నాడు. ఇందుకోసం.. తాను ఎంపిక చేసుకున్న ఐదుగురు అమ్మాయిల్ని గుర్ గావ్ లోని ఒబెరాయ్ హోటల్ కి డిన్నర్ కు తీసుకెళ్లటమే కాదు.. ఐదుగురు ముద్దుగుమ్ములకు ఐఫోన్ 7ను కానుకగా కొనిచ్చేశాడు.

ఇంతా అయ్యాక.. ఇలాంటివి మాటలతో చెబితే నమ్మరనుకున్నారో.. లేకుంటే.. వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా జరుపుకునేందుకు వీలుగా ఇప్పటి నుంచే ముద్దుగుమ్మలను ఊరించేందుకు కానుకగా తానిచ్చిన ఐఫోన్ 7 ఫోన్లను.. తాను ఎంపిక చేసిన ముద్దుగుమ్మలను.. వారితో కలిసి తాను చేసిన డిన్నర్ బిల్లును.. వగైరా.. వగైరాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేశాడు. ఇంత చేసిన తర్వాత.. అప్లికేషన్లు పెట్టుకొని రిజెక్ట్ అయిన 1995 మంది అమ్మాయిలు ఫీల్ అవుతారనుకున్నట్లున్నాడు.. ఈ ఏడాదికి మిస్ అయినా.. వచ్చే ఏడాది ఛాన్స్ కోసం ట్రై చేసుకోడంటూ వచ్చే ఏడాది మాటను ఇప్పుడే చెప్పేశాడు. చేతిలో డబ్బులుంటే ఇలాంటి చిన్నెలు చాలానే చేయొచ్చన్న విషయాన్ని ఈ కుర్రాడు ఎంత బాగా చెప్పేశాడో కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/