Begin typing your search above and press return to search.

సలాం.. పంజాబ్ పోలీస్

By:  Tupaki Desk   |   28 July 2015 4:37 AM GMT
సలాం.. పంజాబ్ పోలీస్
X
ఒక వైపు అత్యాధునిక ఆయుధాలతో తెగబడుతున్న ఉగ్రవాదులు.. మరోవైపు.. తాతల నాటి రైఫిల్స్ పట్టుకున్న పోలీసులు. ఉగ్రవాదుల సంఖ్య తక్కువే ఉండొచ్చు. అయితేనేం.. తుప్పు పట్టిన ఆయుధాలతో.. ఎలాంటి భద్రత కవచాలు లేని పోలీసులు ఎలా వ్యవహరిస్తారు? భయంతో వెనక్కి తగ్గుతారా? లేక.. అత్యాధునిక ఆయుధాల కోసం ఎదురుచూస్తారా? అన్న ప్రశ్నలకు తెర దించుతూ.. సాహసమే ఊపిరిగా.. డ్యూటీనే ప్రాణపదంగా వ్యవహరించి తమ సత్తా చాటారు పంజాబ్ పోలీసులు.

విరుచుకుపడిన ఉగ్రవాదులతో తలపడటమే కానీ.. వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరించారు పంజాబ్ పోలీసులు. హెల్మెట్లు.. బులెట్ ఫ్రూఫ్ జాకెట్లు.. లాంటివి ఏమీ లేకున్నా.. ఉగ్రవాదుల పీచమణచటానికే ప్రాధాన్యత ఇచ్చారు కానీ తమ ప్రాణాల గురించి ఏ మాత్రం పట్టించుకోని ధీరత్వాన్ని పంజాబ్ పోలీసులు ప్రదర్శించారు.

ఉగ్రవాదుల్నిమట్టు పెట్టేందుకు 11 గంటల పాటు ఉగ్రవాదులతో పోరాడిన పంజాబ్ పోలీసులు.. అమితమైన ధైర్యసాహసాల్ని ప్రదర్శించారు. తమకు గాయాలు అవుతాయనో.. ప్రాణాలు పోతాయనో అన్న దాని గురించి అస్సలు ఆలోచించకుండా.. తమ కర్తవ్యాన్ని తాము చేసుకుంటూ పోయారు. కనిపించిన బిల్డింగులు ఎక్కి.. ఉగ్రవాదుల ప్రాణాలు తీసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. తమ లోపాల్ని పక్కన పడేసి.. ఉగ్రవాదుల్ని సంహరించటమే లక్ష్యంగా దూసుకెళ్లిన పంజాబ్ పోలీసుల ధైర్య సాహసాల్ని చూసి.. మనస్ఫూర్తిగా సలాం చేసే పరిస్థితి.