Begin typing your search above and press return to search.

చ‌నిపోయినా అత‌ను నీ భ‌ర్తే క‌ద‌మ్మా?

By:  Tupaki Desk   |   19 Nov 2017 1:30 AM GMT
చ‌నిపోయినా అత‌ను నీ భ‌ర్తే క‌ద‌మ్మా?
X
డ‌బ్బు కోసం గ‌డ్డి క‌రుస్తున్నారు- ఇది పాత‌కాలం సామెత‌. అయితే, ఇప్పుడు మాత్రం అక్ష‌రాలా నిరూపిత‌మైంది. డ‌బ్బు కోసం ఎంత‌కైనా బ‌రితెగిస్తున్న రోజులు న‌డుస్తున్నాయి. అడ్డంగా డ‌బ్బు సంపాయించే వారు రోజూ ఎక్క‌డో ఒక చోట మ‌న‌కు తార‌స‌ప‌డుతూనే ఉన్నారు. అయితే, తాజాగా వెలుగు చూసిన ఓ ఘ‌ట‌న మాత్రం డ‌బ్బు కోసం ఇంత‌టి దారుణాల‌కు కూడా ఒడిగ‌ట్టేవారు ఉంటారా? అనే రేంజ్‌ లో అంద‌రినీ క‌ల‌చి వేస్తోంది. అప్ప‌నంగా వ‌చ్చే బీమా సొమ్ము కోసం అనారోగ్యంతో ఇంటి ప‌ట్టునే మృతి చెందిన భ‌ర్త‌ను ఓ భార్య.. దారుణాతి దారుణంగా కిరాయి మ‌నుషుల‌తో కారుతో తొక్కించేసింది! ఆన‌క అతి పెద్ద డ్రామాకు తెర‌దీసింది. బీమా సొమ్ము రూ.10 ల‌క్ష‌ల‌ను పంచుకునేందుకు సిద్ధ‌మైంది. ఇంత‌లో క‌థ అడ్డం తిరిగింది.. మ‌రి ఈ విష‌యం ఏంటి? అస‌లేం జ‌రిగింది? ఎక్క‌డ జ‌రిగింది? చూద్దాం.. ప‌దండి!

గుంటూరు జిల్లా తెనాలి ప‌రిధిలోని పెదరావూరు సుగాలీ కాలనీకి చెందిన రమావత్‌ కస్నా క్షయ వ్యాధితో ఈ నెల 15న ఉదయం ఇంట్లోనే మృతిచెందాడు. అతడు త్వరలోనే చనిపోతాడని పసిగట్టిన భార్య భ‌ద్ర‌మ్మ‌ - అల్లుళ్లు నల్గొండ జిల్లా రాళ్లవాగు తండాకు చెందిన ధరావత్‌ రాజు నాయక్‌ అనే ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ తో అదే ప్రాంతానికి చెందిన మధ్యవర్తి శ్రీను నాయక్‌ ద్వారా బీమా చేయించారు. ఏడాదికి రూ.1510 ప్రీమియం చెల్లించారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షలు బీమా సొమ్ము వస్తుంది. సహజ మరణానికి రాదు. రమావత్‌ కస్నా సహజ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించి బీమా సొమ్ము కాజేయడానికి నిందితులు పన్నాగం పన్నారు. బీమా సొమ్ములో అతడి కుటుంబ సభ్యులు రూ.4 లక్షలు - ఏజెంటు - మధ్యవర్తి కలసి రూ.6 లక్షలు తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

రమావత్‌ కస్నా టీబీతో గత బుధవారం ఇంటి వద్దే సహజ మరణం చెందాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న భార్య భ‌ద్ర‌మ్మ స్వ‌యంగా బీమా ఏజెంట్‌ రాజునాయక్‌ కు తెలుపగా మధ్యాహ్న సమయంలో మృతుడి అల్లుళ్లు నూనావత్‌ జయరాయ్‌ నాయక్‌ - బాణావత్‌ సైదా నాయక్‌ లు మృతదేహాన్ని ఆటోలో ఎక్కించుకుని మల్లెపాడు రోడ్డులో బయటకు తోసివేశారు. వెనుక కారులో ఉన్న ఏజెంట్‌ రాజునాయక్‌ - శ్రీను నాయక్‌ లు కస్నా మృతదేహాన్ని కారుతో తొక్కించేశారు. దీంతో తీవ్ర గాయాల‌య్యాయి. చేతులు - కాళ్లు విరిగిపోయాయి. త‌ల‌కు పెద్ద గాయ‌మైంది. వెను వెంట‌నే క‌స్నాను తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్క‌డే అస‌లు విష‌యం వెలుగు చూసింది.

దీనిపై అనుమానం వ‌చ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా మృతుడి భార్య భద్రమ్మ బీమా ఏజెంట్‌ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని, మృతి తర్వాత ఏం చేసిందీ వెల్లడించింది. మొత్తానికి ఈ ఘ‌ట‌న జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచల‌నం సృష్టించింది. డ‌బ్బు కోసం ఇంత‌టి దారుణాల‌కు కూడా ఒడిగ‌డ‌తారా? అని ప‌లువురు ఆవేదన వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.