అమెరికాలో కాల్పుల కలకలం.. బాలిక మృతి

Sun Aug 25 2019 10:28:25 GMT+0530 (IST)

కాల్పుల ఘటనలతో తరచూ అమెరికా వార్తల్లోకి వస్తోంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గన్ కల్చర్ ఎక్కువగా ఉండే అమెరికాలో.. ఈ దారుణ కల్చర్ పుణ్యమా అని అమాయకులు బలి అవుతున్నారు.తాజాగా మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. నగరంలోని సోల్డన్ హైస్కూల్ సమీపంలో జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. తన కుటుంబంతో కలిసిన మృతురాలు ఫుట్ బాల్ ఈవెంట్ కు హాజరైంది.

అదే సమయంలో దుండగుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో బాలికతో పాటు మరో ఇద్దరు టీనేజర్లు.. 40 ఏళ్ల మహిళ గాయపడ్డారు. ఈ ఉదంతంతో నగరం ఒక్కసారి ఉలిక్కిపడింది. దారుణమైన విషయం ఏమంటే..గడిచిన నాలుగు నెలల వ్యవధిలో సెయింట్ లూయిస్ నగరంలో కాల్పుల ఉదంతాల్లో ఇప్పటివరకూ 12మంది మృత్యువాత పడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. తాజా ఉదంతంలో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.