Begin typing your search above and press return to search.

గుజరాత్‌ అడుగులు రాహుల్‌ కు కలిసొస్తాయా?

By:  Tupaki Desk   |   19 Dec 2017 10:33 AM GMT
గుజరాత్‌ అడుగులు రాహుల్‌ కు కలిసొస్తాయా?
X
నేడు రాహుల్‌... రాహుల్‌ గాంధీ... నిన్న మొన్నటి వరకు పద్మావతి సినిమా వివాదం. గత కొన్నేళ్లుగా మోడి ప్రాముఖ్యత ఇది జాతీయ స్థాయిలో మీడియా ప్రాధాన్యతలు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మీడియా శైలీ మారిపోయింది. మోడితో పాటు రాహుల్‌ గాంధీకి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించారు. జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికలు ఆఖరికి వాణిజ్య వ్యాపార రంగాలకు సంబంధించిన పత్రికలు సైతం రాహుల్‌ ని కూడా దాదాపు ఆకాశానికి ఎత్తేశాయి. నిన్నమొన్నటి వరకు వారి దృష్టిలో రాహుల్‌ 'జాతీయ పప్పు' ఈ పదం పత్రికల్లో వాడకపోయినప్పటికీ బీజేపీ సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఆ భావం వచ్చే విధంగా రాహుల్‌ గాంధీ గురించి జాతీయ స్థాయిలో మీడియా వ్యాఖ్యానిస్తూ ఉండేది. చచ్చుబడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఆయన జలసత్వాలు నింపలేరని, కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండబోదని చెబుతూ వచ్చిన విశ్లేషకులంతా ఇప్పుడు ఒక్కసారిగా తమ గొంతు సవరించుకున్నారు. ఒక ఆంగ్ల దినపత్రికలో అయితే ఇక 'రాహుల్‌ నోమోర్‌ పప్పు'. దీనిని బట్టి జాతీయ స్థాయిలో అతని పట్ల మీడియా దృక్పథం మారిందని స్పష్టమవుతోంది. అందుకు కారణం గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ దాదాపు దగ్గరగా రావడంతో బీజేపీకి ముఖ్యంగా మోషా ధ్వయానికి (మోడి- అమిత్‌ షా) ముచ్చెమటలు పట్టించడం ద్వారా రాహుల్‌ గాంధీ తన కీర్తిప్రతిష్టలను పెంచుకున్నారు.

గుజరాత్‌ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు విఫలమయ్యాయి. కానీ బీజేపీ మాత్రం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచార సరళి మోడి సాగించిన ప్రచార పరంపర మొదలైన వాటిని దగ్గరగా పరిశీలించినవారు కాంగ్రెస్‌ కష్టం మీద నైనా గుజరాత్‌ లో అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ తృటిలో అధికారం కోల్పోయింది. అయినప్పటికీ కాంగ్రెస్‌ మోములో ఆనందం వెళ్లివిరిసి బీజేపీలో విషాదం నింపే విధంగా ఫలితాలను సాధించడంలో రాహుల్‌ ఎంతో కొంత విజయం సాధించారనేది జాతీయ మీడియా - రాజకీయ విశ్లేషకులు- విమర్శకుల అభిప్రాయం. 182 స్థానాల నున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ 80 సీట్లను గెలుచుకుంది. 2012 ఎన్నికలతో పోలిస్తే 19 స్థానాలు ఎక్కువ. 2014 లోక్‌ సభ ఎన్నికలతో పోలిస్తే 63 స్థానాలను అదనంగా దక్కించుకుంది. ఓట్ల పరంగా పరిశీలిస్తే కాంగ్రెస్‌ తన ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా 4శాతానికి 2012తో పోలిస్తే పెంచుకోగలిగింది. కోటి 24లక్షల ఓట్లతో 41.4 ఓట్ల శాతాన్ని రాహుల్‌ గాంధీ సాధించిపెట్టగలిగారు. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలెవరూ విజయం సాధించలేకపోయారు. ఆ మాటకు వస్తే అసలు పార్టీకి రాష్ట్ర స్థాయిలో ముఖ్యనేతలు లేరనే చెప్పాలి. శంకర్‌ సింగ్‌ వఘేలా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ కు రాష్ట్రంలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నామమాత్ర పలకుబడి కూడా లేదు. అందువల్లనే రాహుల్‌ గాంధీ క్షేత్రస్థాయిలో శ్రమించాల్సి వచ్చింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఊహించనివిధంగా పోటీ ఇవ్వడంతో పాటు ఓట్ల శాతం పెంచుకుని దాదాపు గెలుపు అంచునకు చేరుకోవటానికి రాహుల్‌ గాంధీ వ్యూహత్మక చతురతను ప్రదర్శించి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెంచి ఓటర్లకు దగ్గరకావటమే. అదే సమయంలో 22 ఏళ్లుగా బీజేపీ పాలనలో ఆ రాష్ట్రంలో ఆదర్శనీయమైన అభివృద్ధి అనేది కేవలం నినాదం మాత్రమే అని ప్రజలకు విడమరిచి చెప్పటంతోపాటు ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలు సాగిస్తున్న ఆందోళనలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఓబీసీ నాయకుడు అల్పేష్‌ ఠాకూర్‌ ను పార్టీలో చేర్చుకున్నారు. దళిత సంఘాలకు చెందిన జిగ్నేష్‌ మేవానికి బయటనుంచి మద్దతు ఇచ్చారు. వీరిద్దరూ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. పటీదారులలో బలమైన యువనేతగా ఉన్న హర్ధిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ కు బహిరంగంగానే మద్దతిచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది.

22 ఏళ్ల క్రింతం అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ ఈసారి రాహుల్‌ నాయకత్వంలో తీవ్రంగా ప్రయత్నించి తృటిలో అధికారాన్ని కోల్పోయింది. అందుకు ప్రధానంగా పార్టీకి బలమైన యంత్రాంగం లేకపోవడం. మరీ ముఖ్యంగా పోలింగ్‌ కేంద్రాల లక్ష్యంగా బీజేపీ దాని ప్రధానమైన ఆర్‌ ఎస్‌ ఎస్‌ తదితర సంఘాలు అమలు చేస్తున్న హిందూత్వ అజెండాను తట్టుకునే స్థాయిలో కాంగ్రెస్‌ లేకపోవడం. రాష్ట్ర స్థాయి నాయకత్వం కొరవడడం. పార్టీకి అర్జున్‌ మోడ్వాడియా - శక్తిసింగ్‌ గోహైల్‌ లాంటి వారు ఓటమిపాలయ్యారంటే వారు ఎంత బలమైన నాయకులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాహుల్‌ పూర్తిగా హార్ధిక్‌ పటేల్‌ - జిగ్నేష్‌ మేవాని - అల్పేష్‌ ఠాకూర్‌ లపై ఆధారపడ్డారు. మరీ ముఖ్యంగా హార్ధిక్‌ పటేల్‌ పై. పాటీదార్లలలో యువకులు మినహా 40 ఏళ్ల పైబడిన వారంతా కాంగ్రెస్‌ను నమ్మలేకపోయారు. దాంతో పాటీదార్ల ఓట్లన్ని కాంగ్రెస్‌ కు గంపగుత్తగా లభించలేదు. మాధవ్‌ సింగ్‌ సోలంకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 149 సీట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇదే రికార్డు. దీనిని అధిగమించి 150 స్థానాలతో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రముఖంగా ప్రకటించుకున్నప్పటికీ 99 నాటౌట్‌ గా మిగిలిపోయారు. గతంలో మాధవ్‌ సింగ్‌ సోలంకి అమలు చేసిన 'ఖామ్‌ (క్షత్రియ - హరిజన - ఆదివాసి - ముస్లిం)' లతోపాటు కొత్తగా పటేల్‌ కార్డు ప్రయోగించినప్పటికీ కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో ఫలితాన్ని సాధించలేకపోయింది. గుజరాత్‌ నమునా అభివృద్ధి అంశాన్ని రాహుల్‌ ఎత్తిచూపి బీజేపీ వైఫల్యాన్ని ఎండగట్టినప్పటికీ మతం ఆధారంగా వివిధ అంశాలను ముఖ్యంగా మణిశంకర్‌ అయ్యార్‌ నీచ్‌ వ్యాఖ్యలు - చాయ్‌ వాలా లాంటి అంశాలతో పాటు పాకిస్థాన్‌ తో కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యిందనే ప్రచారాన్ని మోడి ముందుకు తీసుకువెళ్లటం వల్ల రాహుల్‌ వ్యూహం దెబ్బతినింది. ముఖ్యంగా మణిశంకర్‌ అయ్యార్‌ పై చర్య తీసుకున్నప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యాలను మోడి తనకు అనుకూలంగా మలుచుకుని లాభపడ్డారు. ఇక అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ తనదైన శైలిని ప్రదర్శించింది. రెండవ దశ అభ్యర్థుల ఎంపికలో అయితే మరింతగా తప్పులు చేసి నష్టాన్ని కొని తెచ్చుకుంది. యువనేతల్లో హార్ధిక్‌ పటేల్‌ తో పొత్తు ఉంటుందా? లేదా? లాంటి ఊగిసలాట - అభ్యర్థుల ఎంపికలో గందరగోళం మొదలైన అంశాలు పార్టీకి నష్టం కలిగించాయి.

అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ తన పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుచుకోగలిగింది. పట్టణ ప్రాంతాల్లో సీట్లు తగ్గినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే బాగా మెరుగుపడింది. అందరూ బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో పట్టును గుర్తిస్తున్నారు కానీ కాంగ్రెస్‌ కూడా తన ఓట్ల శాతాన్ని - సీట్లను పట్టణాల్లో గణనీయంగా పెంచుకుంది. 2012లో 2.84 శాతం సీట్లు ఉండగా ఇప్పుడు అది 6.49కి పెరిగింది. గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓట్ల-సీట్ల పెరుగుదలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఈ పెరుగుదల చాలా ఎక్కువ.

2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 44 స్థానాలకు పరిమితమైపోవటం ఆ తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్‌ - గోవా - మహారాష్ట్ర - హర్యానా - అస్సాం - ఉత్తరాఖండ్‌ - కేరళ ఎన్నికల్లో ఓడిపోవడం కేవలం పంజాబ్‌ లో గెలుపొందడం మాత్రమే కాంగ్రెస్‌ కు సాధ్యమైంది. హిమాచల్‌ ప్రదేశ్‌ - కర్నాటక - పుదుచ్చేరిలు మిగలగా తాజాగా హిమాచల్‌ ను కోల్పోయింది. వచ్చే ఏడాది కర్నాటక - రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ - చత్తీస్‌ ఘడ్‌ లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా బీజేపీనే కాంగ్రెస్‌ కు బలమైన ప్రత్యర్థి.

గుజరాత్‌ బీజేపీకి బలమైన కేంద్రం. ఆర్‌ఎస్‌ ఎస్‌ హిందూత్వ ప్రయోగశాల. వరుసగా 6సార్లు అధికారంలోకి వచ్చింది. అటువంటి రాష్ట్రం నుంచే మోషా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీని విజయానికి అంచులదాకా తీసుకువెళ్లటంలో రాహుల్‌ విజయం సాధించారు. ఇందుకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు - నిరుద్యోగ యువకులు - కూలీల్లో ఉన్న వ్యతిరేకతను మరీ ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా మలుచుకోగలిగారు. అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు రుణాలు రద్దు చేస్తామనే హామీ కొంతమేర పనిచేసింది. బీజేపీ ప్రజల్లో వ్యతిరేకతనను చవిచూసే అంశాలను ప్రధానంగా రాహుల్‌ ఎన్నికల ప్రచారాస్త్రాలు చేసుకుని - వ్యక్తిగత అంశాల జోలికి పోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రధానిని నీచ్‌ గా వ్యాఖ్యానించిన మణిశంకర్‌ అయ్యార్‌ లాంటి సీనియర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించడం రాహుల్‌ హోదాను పెంచింది. మొత్తం బీజేపీ శ్రేణుల్లో ముఖ్యంగా ఆర్‌ఎస్‌ ఎస్‌ యంత్రాంగంలో ఒక విధమైన అభద్రత భావాన్ని, ఓటమి భయాన్ని తీసుకురావడంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు విజయం సాధించారు. రాష్ట్రంలో 55 పట్టణ నియోజకవర్గాలు ఉండగా వాటిలో 43 బీజేపీ గెలుపొందింది. గతంతో పోలిస్తే మూడు స్థానాలు తగ్గటానికి రాహుల్‌ కష్టమే కారణంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 127 స్థానాలు ఉండగా 71 చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. మొదటి దశ పోలింగ్‌ లో కాంగ్రెస్‌ కు అనుకూలిస్తే రెండద దశలో బీజేపీకి అనుకూలించడానికి ప్రధాని పూర్తిస్థాయిలో రామమందిరం - పాకిస్థాన్‌ - మణిశంకర్‌ అయ్యార్‌ నీచ్‌ వ్యాఖ్యలు తెరమీదకు తీసుకురావటమే.

గుజరాత్‌ లో పరిస్థితి కాంగ్రెస్‌ కు మెరుగుపడినా భవిష్యత్తు అంత సులభంగా ఏమీ ఉండదు. కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యతిరేకత చవిచూడనప్పటికీ బీజేపీ నుంచి గట్టిపోటీనే ఎదుర్కొంటుంది. అదే విధంగా రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ - చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రలలో తలపడాలి. చాలా కాలంగా రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలలో కాంగ్రెస్‌ బలమైన యువనేతలు సచిన్‌ పైలెట్‌ - జోతీరాధిత్య సింధ్యా తదితరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతోంది. గుజరాత్‌ ఫలితాలు కాంగ్రెస్‌ కు కొత్త ఊపునిచ్చాయి. పార్టీ యంత్రాంగంలో ఆత్మస్థైర్యం ఎంతో కొంత పెంచుతుంది. గత మూడున్నరేళ్లలో దేశంలో మోడి పాలన ఏమంత మెరుగ్గాలేదనే అభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడతాయి. అయినంత మాత్రాన అవి సరిపోవు. 2019 సాధారణ ఎన్నికల్లో రాహుల్‌ మోడిని ఛాలెంజ్‌ చేయగలిగే నేత అవుతారని సమాజ్‌ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ తదితరులు బీజేపీ ఇక కష్టకాలం ఎదుర్కొంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో గుజరాత్‌ అడుగులు రాహుల్‌ ను మోడిని తట్టుకునే విధంగా ముందుకు తీసుకువెళతాయా అనేది వేచి చూడాల్సిందే?

ఎస్‌.వి.రావ్‌