Begin typing your search above and press return to search.

రాహుల్ ప్రచార జోరుకు బిజెపి 'బూత్ ల' విరుగుడు

By:  Tupaki Desk   |   27 Nov 2017 1:58 PM GMT
రాహుల్ ప్రచార జోరుకు బిజెపి బూత్ ల విరుగుడు
X
గుజరాత్‌ ఎన్నికల్లో ప్రతీకూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అధికార బిజెపి పార్టీని ఎలాగైనా గెలిపించాని ప్రధాని మోడి - బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా నడుంబిగించడంతో మొత్తం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ యంత్రాంగాలు ఆ రాష్ట్రంలోనే కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. 22 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బిజెపి తొలిసారిగా ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు నుంచి ముఖ్యంగా రైతులు - వ్యాపారులు వివిధ కుల - వర్గ సమాజాలు నుంచి తీవ్ర వ్యతిరేకత చవిచూస్తుండడంతో ఆందోళన చెందుతున్న బిజెపి అగ్రనాయకత్వం తన శక్తియుక్తులను మొత్తం కేంద్రీకరించి పనిచేస్తోంది. మోడి - అమిత్‌ షా సొంత రాష్ట్రం కావడంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయోగశాలగా విజయవంతమై దేశం మొత్తానికి బిజెపిలో ఆదర్శం కావడంతో పాటు మోడల్‌ స్టేట్‌గా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించి అధికారంలోకి రావటం కన్నా కనీసం 120 స్థానాలు దాటి గెలవకపోతే ఆ పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నాట్లే భావించాల్సి వస్తుందని ఆందోళన చెందడం వల్ల అత్యంత ప్రతిష్టాత్మాకంగా బిజెపి తలపడుతోంది. బిజెపి - ఆర్‌ఎస్‌ఎస్‌ వాటి అనుబంద సంఘాలు గ్రామాలకు చేరుకుని ప్రతీ గ్రామంలోని దేవాలయం లేదా పాఠశాల లాంటి వాటిని కేంద్రంగా చేసుకొని బూత్‌ కమిటీ సమావేశాలు నిర్వహించడం ప్రారంభించాయి. మొత్తం పార్టీ కేంద్ర నాయకత్వంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులు - పలువురు కేంద్రమంత్రులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.

182 స్థానాలున్న శాసనసభ ఎన్నికల్లో ఊహించని విధంగా కాంగ్రెస్‌ గట్టిపోటీ ఇస్తోంది. నిజానికి కాంగ్రెస్‌ పోటీ ఇస్తోందనే దానికన్నా బిజెపి వ్యతిరేకత చవిచూస్తోందని ముఖ్యంగా రైతులు - చిన్న వ్యాపారులు ఉత్పాదకశక్తులతో పాటు పటేదార్లు - దళితులు - ఓబీసి వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతూ వారంతా కాంగ్రెస్‌కు అండగా నిబడడం వల్లనే బిజెపి ఓ విధమైన ఆందోళనకు గురై కనీసం 35 మంది ప్రముఖ నేతలను ఎన్నికల గోదాలోకి దింపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహం-బూత్‌ కేంద్రం అనే నినాదాన్ని మళ్లీ పూర్తిస్థాయిలో అమలు చేస్తూ 50వేల పోలింగ్‌ కేంద్రాలకు మొత్తం మత - అతివాద - ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘాలను పూర్తిగా కేంద్రీకరించి పనిచేస్తోంది. ప్రధాని మోడి నవంబర్‌ 26న రేడియో - దూరదర్శన్‌లో చేసిన ప్రసంగం మొత్తాన్ని బిజెపి వాడవాడలా ప్రత్యక్ష ప్రసారాలు - లౌడ్‌ స్పీకర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుంది. ఆ కార్యక్రమం తిలకించిన - విన్న శ్రోతలందరికీ టీలు పంపిణీ చేసిందంటే ఎంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రధాని మోడి నవంబర్‌ 27న ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ఆ రాష్ట్రంపైనే దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. బిజెపికి సంబంధించిన దాదాపు అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రానికే వలస వెళ్లిపోయారు. అక్కడి నుంచే తమ రాష్ట్రాల పరిపాలన సాగిస్తూ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కేంద్ర మంత్రులు ముఖ్యంగా అరుణ్‌జైట్లీ - స్మృతీ ఇరానీ - పియూష్‌ గోయల్‌ - ఉమాభారతి - ధర్మేంద్రప్రదాన్‌ తదితరులు ఆ రాష్ట్రంలో బిజెపికి దిశ నిర్దేశం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో వీరంతా మోడికి అత్యంత విశ్వసనీయులనే విషయం అందరికీ తెలిసిందే. వీరితో పాటు పార్టీ సీనియర్‌ లీడర్లు రామ్‌లాల్‌ వి.సతీష్‌ - భూపేంద్ర యాదవ్‌ - తదితరులు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌లో వ్యూహాన్ని పరివేక్షిస్తున్నారు. 182 స్థానాల్లోనూ 50వేల 128 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిలో 50వేల కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని బిజెపి యంత్రాంగం పనిచేస్తోంది. ప్రతీ కార్యకర్త అంటే కమిటీల్లోని ముఖ్యులు రోజూ 40 నుంచి 50 మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలిసే విధంగా ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి వ్యూహాన్ని పటిష్టంగా అమలుచేస్తోంది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఏకపక్షంగా ఆధిపత్యం సాగించినప్పటికీ కాంగ్రెస్‌ తన ఉనికిని బలంగా చాటుకుంటూ 33.45% ఓట్లు సాధించుకుంది. 2012లో రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 8.92శాతం ఉంది. ఆ ఎన్నికల్లో బిజెపికి 47.85శాతం లభించగా - కాంగ్రెస్‌కు 38.93 శాతం ఓట్లు పోలాయ్యాయి. 2014 ఎన్నికల ప్రకారం బిజెపికి ఇప్పుడు 155కు పైగా శాసనసభ స్థానాలు లభించే అవకాశం ఉన్నప్పటికీ 2012 ఎన్నిక ఫలితాలనే ఆ పార్టీ పరిగణలోకి తీసుకుందంటే క్షేత్రస్థాయిలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందో మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 61 స్థానాలు వచ్చాయి. అదే స్థాయిలో కాంగ్రెస్‌ ఉండే అవకాశం లేదని మరింతగా మెరుగుపడుతుందని ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఇప్పటికే దాదాపు 4శాతం ఓట్ల వ్యత్యాసం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని బిజెపి అంచనాకు వచ్చింది. ఫలితంగానే మాటలు విడిచిపెట్టి చేతలకు సిద్ధమవుతోంది.

కాంగ్రెస్‌ నుంచి ఏకైక నాయకుడు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధి తలపడుతుండగా ఆయన ప్రధానంగా పెద్దనోట్ల రద్దు - జీఎస్టీ - కార్పోరేట్‌ రంగానికి మోడి ఇస్తోన్న రాయితీలు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు. ఈయన ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విస్తృతంగా జనంలోకి వెళుతున్నారు. పార్టీ పరంగా కాంగ్రెస్‌ పూర్తి బలహీనపడి గ్రామస్థాయిలో యంత్రాంగం అంతంతమాత్రంగానే ఉండగా ఆ రాష్ట్రంలో వివిధ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న హార్ధిక్‌పటేల్‌ - అల్పేష్‌ - జిగ్నేష్ మేవానీతో పొత్తుపెట్టుకుని తద్వారా ఓట్లు రాబట్టుకునే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. కానీ కాంగ్రెస్‌లో క్షేత్రస్థాయి వ్యూహాలు - పనిచేసే యంత్రాంగం పూర్తిగా కొరవడ్డాయి. కులాలు-సామాజిక వర్గాల వారిగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటిని ప్రోది చేయటం ద్వారా గొలుపొందాలనేది కాంగ్రెస్‌ వ్యూహం. అటువంటి ఓట్లను తమకు అనుకూలంగా పోల్‌ చేయించుకునే యంత్రాంగం అయితే కాంగ్రెస్‌కు లేదనే చెప్పాలి.

అందువల్లనే బిజెపి పూర్తిగా క్షేత్రస్థాయిలో మతం ప్రాతిపాదికన - జాతీయవాదం - మోడి సెంటిమెంట్‌ - ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయోగశాల విజయవంతం సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. బిజెపి నేతలు అందరూ ఒకే చోట కేంద్రీకరించి పనిచేయకుండా దాదాపు 35 మంది అగ్రస్థాయి నాయకులు వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరించి వ్యూహాత్మకంగా తమ బలాన్ని కూడదీసుకుంటున్నారు. పోలింగ్‌ రోజు పరిస్థితి అనుకూలంగా ఉండేట్లు చూసుకోవడమే ముఖ్యమని బిజెపి భావిస్తోంది. అందుకోసమే 50వేల బూత్‌లు వ్యూహాత్మక లక్ష్యం ఇప్పటికే అమలులోకి వచ్చింది. డిసెంబర్‌ 9 - 14 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా ఈ ఎన్నికల కోసమే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ఆలస్యంగా అంటే డిసెంబర్‌ 15 నుంచి నిర్వహిస్తున్నారు. సోమవారం మోడి కచ్‌లో బహిరంగ సభ ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఉంటారు. మళ్లీ బుధవారం గుజరాత్‌ వెళ్లి 4 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

-----ఎస్ . వి. రావు