కాంగ్రెస్ లో లొల్లి షూరూ..? సీఎం కొట్లాటనట..

Mon Dec 10 2018 13:29:34 GMT+0530 (IST)

ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల లొల్లి షూరు అయ్యింది. ఎన్నికలప్పుడు మాత్రమే కాంగ్రెస్ నాయకులు ఏకతాటిపై ఉంటున్నారు. నిన్న మొన్నటి దాకా కలిసి ప్రచారం చేసిన నాయకులంతా.. ఇప్పుడు ఎవరికీ వారే యమునా తీరే.. అన్నట్లు మళ్లీ గ్రూపు రాజకీయాలకు తెర లేపుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని అందరికీ తెలిసిన విషయమే. ఇక అసలు విషయానికొస్తే.. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొంత వర్గాన్ని కూడగట్టుకున్నాడని ఉత్తమ్ వర్గం లోలోపల మండిపడుతున్నట్లు సమాచారం.  రేవంత్ రెడ్డి ఎన్నికలకు ఫండ్ లో చాలాశాతం పీసీసీ నుంచి వెళ్తే ఆయన దానిని తన గ్రూపును తయారు చేసుకోవడానికి వాడుకున్నారని ఉత్తమ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఉత్తమ్ కుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ ఖచ్చితమైన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే 12న పదవీ స్వీకారం విషయంలో ఉత్తమ్ కు ఇప్పటికే అధిష్టానం డైరెక్షన్ ఇచ్చిందని ఆయన వర్గీయులు సంబరపడుతున్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పడు ఏం జరుగుతుందో ముందే చెప్పడం కష్టం. చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి మారుతూనే ఉంటారు. ఏదిఏమైనా సరే కాంగ్రెస్ గెలిస్తే అధిష్టానం నిర్ణయించిన వ్యక్తే ముఖ్యమంత్రి కావడం ఖాయం అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదంతా జరగాలంటే ముందు ఎన్నికల్లో గెలవాలి. కానీ నేతలు మాత్రం ఆలూ లేదు.. చూలు లేదు నేనే సీఎం అని ఆశలు పెంచుకుంటుండడం గమనార్హం.