ఆస్ట్రేలియాలో అరాచకం... వీడియో వైరల్

Fri Nov 09 2018 18:46:12 GMT+0530 (IST)

అమెరికాలో నానాటికీ గన్ కల్చర్ పెరిగిపోతోందని ఆందోళనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో మరో కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ ఘటన సద్దుమణగక ముందే ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో కత్తి పోట్ల ఘటన కలకలం రేపింది. మెల్ బోర్న్ సెంట్రల్ డిస్ట్రిక్ లో శుక్రవారం నాడు ఓ వ్యక్తి హఠాత్తుగా అక్కడి పాదచారులపై - పోలీసులపై కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు...నిందితుడిపై ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది ఉగ్ర దాడి ఘటనగా భావిస్తున్నామని మెల్ బోర్న్ పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.మెల్ బోర్న్ సెంట్రల్ డిస్ట్రిక్ లోని ఓ రద్దీగా ఉండే రోడ్డులో ఓ కారు మంటల్లో చిక్కుకొంది. ఆ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ కారుకు నిప్పుపెట్టాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే ఆ వ్యక్తి అకస్మాత్తుగా కత్తితో అక్కడున్న వారిపై  - పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు కత్తిపోటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.....నిందితుడిపై కాల్పులు జరిపారు. గాయపడ్డ నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. కత్తిపోట్లకు గురైన ముగ్గురిలో ఒక వ్యక్తికి తల భాగంలో గాయమైందని మరో వ్యక్తి  ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మూడో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


వీడియో కోసం క్లిక్ చేయండి