రమ్యకే మోసం..ఉప ఎన్నికల్లో బీజేపీకి జై!

Mon Oct 22 2018 17:01:40 GMT+0530 (IST)

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ - సోషల్ మీడియా చీఫ్ గా వ్యవహరిస్తున్న ప్రఖ్యాత దక్షిణాది నటి రమ్య కు సొంత పార్టీ నాయకులు - అభిమానులే చుక్కలు చూపిస్తున్నారు. గతంలో రమ్యను అవమానించిన నేత ప్రస్తుతం జేడీఎస్ లో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. రమ్య ఎంత సర్ధిచెప్పినా అతడిని ఓడిస్తామని శపథం చేస్తున్నారు.కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా లోక్ సభకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా జేడీఎస్ లో ఇటీవలే చేరిన కాంగ్రెస్ నేత ఎల్ ఆర్. శివరామే గౌడను నిలబెట్టారు. 

అయితే ఇదే శివరామే గౌడ గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి రమ్య ఓటమికి కారణమయ్యారు. 2014 ఎన్నికల్లో రమ్య ఓడిపోవడానికి శివరామే గౌడ కారణమని ఆమె అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. తాను రమ్య ఓటమికి పనిచేశానని శివరామే గౌడ కూడా స్వయంగా ఓ సందర్భంలో చెప్పడం రమ్య అభిమానులకు కోపం తెప్పించింది. దీంతో  రమ్య చెప్పినా సరే ఈసారి జేడీఎస్ అభ్యర్థి శివరామే గౌడను ఓడిస్తామని ఆమె ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి డాక్టర్ సిద్ధరామయ్య బరిలో ఉన్నారు.

ఇలా మాండ్య నియోజకవర్గంలో  రమ్య ఫ్యాన్స్ - అసమ్మతి నేతల సెగతో బీజేపీ గెలుపు ఈజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.