Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు గిఫ్ట్; మరో 0.5శాతం పన్నుపోటు

By:  Tupaki Desk   |   28 May 2016 5:12 AM GMT
మోడీ సర్కారు గిఫ్ట్; మరో 0.5శాతం పన్నుపోటు
X
తమ రెండేళ్ల పాలన గురించి ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకుంటున్నారు. భారతదేశాన్ని వాయువేగంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తున్నట్లుగా మోడీ మొదలు పలువురు బీజేపీ ముఖ్యనేతలు పదే పదే చెప్పుకోవటం కనిపిస్తుంది. తమ ప్రభుత్వ హయాంలో అవినీతి అన్నది లేదన్నట్లుగా చెప్పుకుంటున్న కమలనాథులు.. తమ పాలన అద్భుతంగా ఉందని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తగ్గట్లే మీడియా సైతం మోడీ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రచారం చేస్తుంది. మోడీ పాలన బాగోలేదని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు.. రెండేళ్ల మోడీ పాలనలో ప్లస్ లు ఉన్నట్లే.. మైనస్ లు కూడా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

చిత్రమైన విషయం ఏమిటంటే.. మోడీ పాలనను అందరూ పొగిడేసే వారే కానీ.. ఆయన సర్కారు చేసిన తప్పులు.. ప్రజల మీద మోపిన భారం గురించి ఎవరూ ప్రస్తావించని వైనం కనిపిస్తుంది. మోడీ పాలనకు సంబంధించి రెండు అంశాల్ని ఇక్కడ ప్రస్తావించాలి. గడిచిన రెండేళ్ల వ్యవధిలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి. కానీ.. వాటి ఫలాలు ప్రజల కంటే ప్రభుత్వమే ఎక్కువ పొందిన విషయాన్ని మర్చిపోకూడదు. భారీగా తగ్గిన చమురు ధరల్ని యధాతథంగా ప్రజలకు మళ్లించి ఉంటే.. ధరలు భారీగా తగ్గటంతో పాటు.. వాటి ఆధారిత రంగాలపై ఖర్చు భారం తగ్గటంతో పాటు.. వస్తు సేవలు మరింత చౌక అయ్యేవన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయినప్పటికీ ఆచితూచి తగ్గింపు కనిపిస్తుందే తప్పించి.. అంతర్జాతీయంగా తగ్గిన ధరలకు తగ్గట్లుగా పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గలేదు. ధరల్ని తగ్గించాల్సిన సమయంలో పన్ను పోటుతో సర్దుబాటు చేసిన విషయాన్ని మర్చిపోకూడదు.

ఇక.. సేవాపన్ను చట్రంలోకి భారీ ఎత్తున వివిధ సేవల్ని తీసుకొచ్చేసిన వైనాన్ని ఎవరూ ప్రశ్నించటం లేదు. ఒక మంచి ప్రభుత్వం ఎలా ఉండాలన్న మాటకు.. అవినీతి రహితంగా ఉండటంతో పాటు.. ప్రజల మీద పన్ను భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. కానీ.. ఆ విషయంలో మోడీ సర్కారు ఎలాంటి అడుగు వేయలేదని చెప్పాలి. పన్నుభారాన్ని తగ్గించటం అటుంచి.. ఏ మాత్రం అవకాశం చిక్కినా పన్నుపోటు వేయటానికే చొరవ ప్రదర్శించిందే తప్పించి పన్నుభారం నుంచి దేశ ప్రజల్ని తప్పించాలన్న ఆలోచన ఏదీ మోడీ సర్కారులో కనిపించలేదనే చెప్పాలి.

భారీగా పెరిగిన వస్తు సేవల పన్ను పుణ్యమా అని బీమా పాలసీ తీసుకున్నా వందకు రూ.14.5 పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి. సేవా పన్నుకు అదనంగా వ్యాట్ ఉండనే ఉంది. ఇలా భారీగా ఉన్న పన్నులకు జతగా తాజాగా మరో పన్ను దేశ ప్రజల మీద పడనుంది. ఈ పన్నుపోటు చూసేందుకు తక్కువగా కనిపించినా.. వేలాది కోట్ల రూపాయిల టర్నోవర్ మీద భారీ మొత్తమే ప్రభుత్వానికి సమకూరుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. స్వచ్ఛ భారత్ పన్ను పేరిట 0.5 సేవాపన్నుకు అదనంగా వసూలు చేస్తున్న ప్రభుత్వం.. జూన్ 1 నుంచి ‘‘కృషి కల్యాణ్ సెస్’’ పేరుతో మరో పన్నుకు విధించనుంది. ఈ తాజా పన్ను 0.5శాతంగా ఉండనుంది. బీమా.. అతిధ్యం.. వైద్యం.. ప్రయాణం తదితర రంగాలపై పడనుంది. దీంతో.. ఇప్పటివరకూ ఉన్న 14.5 సేవా పన్ను కాస్తా.. జూన్ 1 నుంచి 15 శాతం కానుంది. అచ్చేదిన్ అంటే.. పన్నుపోటు రోజురోజుకి పెరిగిపోవటమేనా..?