Begin typing your search above and press return to search.

కొత్త కోణం: కట్టినోళ్లే కూల్చేశారు!

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:40 AM GMT
కొత్త కోణం: కట్టినోళ్లే కూల్చేశారు!
X
బాబు జ‌మానాలో నిర్మించిన ప్ర‌జావేదిక‌ను తాజాగా కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.8కోట్ల‌కు పైనే ప్ర‌జాధ‌నంతో నిర్మించిన ప్ర‌జావేదిక నేటి నుంచి నిన్న‌టి జ్ఞాప‌కంగా మారింద‌ని చెప్పాలి. అక్ర‌మ క‌ట్ట‌డంగా అధికారులు తేల్చిన క్ర‌మంలో దాన్ని కూల్చివేయాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌టం.. అక్ర‌మ నిర్మాణాల విష‌యంలో తానెంత క‌ర‌కుగా ఉంటాన‌న్న విష‌యాన్ని ఆయ‌న చేత‌ల్లో చేసి చూపించార‌ని చెప్పాలి.

బుధ‌వారం కూల్చివేత ఉంటుంద‌ని భావించినా.. ఊహించ‌ని రీతిలో మంగ‌ళ‌వారం రాత్రి నుంచే కూల్చివేత కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి 10 గంట‌ల‌కు ప్ర‌జావేదిక నిర్మాణాన్ని కూల్చివేత‌ను ప్రారంభించారు. అధికారులు.. కూలీలు త‌ప్పించి మ‌రెవ‌రినీ పోలీసులు లోప‌ల‌కు అనుమ‌తించ‌లేదు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. నాడు ద‌గ్గ‌రుండి క‌ట్టించిన అధికారులే నేడు ద‌గ్గ‌రుండి కూల్చివేత‌లో భాగ‌స్వామ్యం కావ‌టం. ప్ర‌భుత్వంలోని ఒక శాఖ త‌ప్పుడు ప‌ని చేస్తున్న‌ప్పుడు కిమ్మ‌ని అధికారులు.. తాజాగా త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోయారు. అక్ర‌మ క‌ట్ట‌డాల విష‌యంలో క‌ర‌కుగా వ్య‌వ‌హ‌రించిన సీఎం జ‌గ‌న్ ను త‌ప్పు ప‌ట్ట‌లేం.

ఇవాల్టి హైద‌రాబాద్ ప‌రిస్థితి చూస్తే.. జ‌గ‌న్ లాంటి నేత లేక‌పోవ‌టంతో కోటిన్న‌ర వ‌ర‌కూ ఉన్న హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌లు అనునిత్యం ఇబ్బందులు ప‌డుతున్నారు. వ‌ర్షం లాంటిది ప‌డితే వాన నీరు రోడ్ల మీద నుంచి పోక‌.. వాహ‌నాలు ఆగిపోయి న‌ర‌కం అంటే ఏమిటో చూస్తున్న ప‌రిస్థితి. ఇవ‌న్నీ చూసిన‌ప్పుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్ట‌టానికి వీల్లేని రీతిలో ఉంటుంది. ప్ర‌జాధ‌నం వృధా అయినా.. అదో హెచ్చ‌రికలా మారితే.. రాబోయే రోజుల్లో త‌ప్పు చేసేందుకు బ‌య‌ప‌డ‌తారు.

ప్ర‌జావేదిక విష‌యానికి వ‌స్తే.. దాన్నినిర్మించ‌టానికి చెమ‌ట‌లు క‌క్కిన అధికారులు.. తాజాగా ఆ నిర్మాణం కూల్చివేత సంద‌ర్భంలోనూ అదే ప‌ని ఒత్తిడి ఎదుర్కోవ‌టం గ‌మ‌నార్హం. నిజానికి అక్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చే అధికారి కానీ ఆ రోజున గ‌ట్టిగా నిల‌బ‌డి ప్ర‌భుత్వానికి చెప్పి ఉంటే.. ఈ రోజున కోట్లాది రూపాయిల ప్ర‌జాధ‌నం వృధా అయ్యేది కాదు. త‌ప్పున‌కు మూల్యం చెల్లించాలి త‌ప్ప‌దంతే.