Begin typing your search above and press return to search.

మోడీతో కేసీఆర్ భేటీకి గ‌వ‌ర్న‌ర్ లాబీయింగ్?

By:  Tupaki Desk   |   14 Jun 2018 7:44 AM GMT
మోడీతో కేసీఆర్ భేటీకి గ‌వ‌ర్న‌ర్ లాబీయింగ్?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో రెండు కోణాలు కొట్టొచ్చిన‌ట్లుగా కనిపిస్తుంటాయి. కొన్ని విష‌యాల్లో ఆత్మ‌గౌర‌వ అంశాన్ని తెర మీద‌కు తీసుకొచ్చి కోట్లాది మందిని క‌దిలించే ఆయ‌న‌.. మ‌రికొన్ని విష‌యాల్లో వ‌రుస పెట్టి ఎదురుదెబ్బ‌లు త‌గిలినా కిమ్మ‌న‌కుండా ఉండే తీరు క‌నిపిస్తుంది.

అవ‌స‌ర‌మైతే ప్ర‌ధాన‌మంత్రిని సైతం.. మీరెంత‌? అన్న‌ట్లు క్వ‌శ్చ‌న్ వేసే కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీ త‌న‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌ని వైనంపై ఎంత‌లా ఫీల్ కావాలి? ప‌్ర‌ధానితో భేటీ అన్న‌ప్పుడు ప్రాధ‌మికంగా ఏర్పాట్లు చేసుకోకుండా ప్ర‌క‌ట‌న అయితే చేయ‌రు. ఢిల్లీకి పోతున్నా.. ప్ర‌ధానిని క‌లుస్తున్నా అని చెప్పి అక్క‌డ‌కు వెళ్లాక అపాయింట్ మెంట్ లేదు.. సార్ ఫుల్ బిజీ అంటే ఎంత అవ‌మానం?

అందునా.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అన్న సిద్ధాంతాన్ని తెర మీద‌కు తెచ్చి 2019లో ఏదేదో చేస్తాన‌ని చెప్పే రాష్ట్ర ముఖ్య‌మంత్రికి పీఎం టైమివ్వ‌క‌పోవటం దేనికి ఇండికేష‌న్‌? ఇలా ఆలోచిస్తే.. మోడీ త‌న‌కు టైమివ్వ‌ని తీరుపై ఎంత ర‌చ్చ చేయాలో అంత ర‌చ్చ చేసి.. తెలంగాణ సెంటిమెంట్ ను తెర మీద‌కు తీసుకొచ్చేందుకు నూటికి నూరు శాతం అవ‌కాశం ఉంది.

అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌లేదు స‌రిక‌దా.. పీఎం త‌న‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌ని వైనాన్ని ఆయ‌న సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లే క‌నిపించ‌లేదు. ప్ర‌ధానితో భేటీకి కుద‌ర‌క తిరుగు ట‌పాలో హైద‌రాబాద్‌ కు వ‌చ్చి నెల కూడా అయ్యిందో లేదో కానీ.. మ‌ళ్లీ మ‌రోసారి ఆయ‌న ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈసారి క‌చ్ఛితంగా ప్ర‌ధానిని క‌ల‌వ‌నున్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయి.

గ‌తానికి భిన్నంగా ఈసారి పీఎంతో త‌న భేటీకి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ముందే వెల్ల‌డించేశారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వేళ‌లో ప్ర‌ధాని మోడీతో కేసీఆర్ భేటీ కానున్న‌ట్లుగా సీఎం ఆఫీసు ఒక ప్ర‌క‌ట‌న‌ను కూడా జారీ చేసేసింది. ఇంత‌కూ భేటీ అజెండా ఏమిటంటే.. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాలు మోడీ మాష్టారితో మాట్లాడనున్న‌ట్లు చెబుతున్నారు. చూసేందుకు అంతా బాగున్న‌ట్లు క‌నిపిస్తున్నా.. తెర వెనుక చాలానే జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌ధాని మోడీతో భేటీకి డేట్‌.. టైమ్ ఫిక్స్ కావ‌టానికి ముందు ఒక ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ మ‌ధ్య‌నే రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసిన భేటీ.. వారం కూడా కాక‌ముందే మ‌రోసారి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగానే ప్ర‌ధాని అపాయింట్ మెంట్ ఫిక్స్ కావ‌టం.. కేసీఆర్ సార్ ఢిల్లీ టూర్ ముచ్చ‌ట బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఎందుకిలా? అన్న కుతూహ‌లంతో వాక‌బు చేస్తే.. బ‌య‌ట‌కు వ‌చ్చిన మాటేమిటంటే.. కేసీఆర్ మాష్టారికి ప్ర‌ధానితో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయించ‌టంలో గ‌వ‌ర్న‌ర్ కీ రోల్ ప్లే చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఎందుక‌న‌గా అంటే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ సార్ చేసిన టూర్ల సారాంశాన్ని మోడీ చెవిలో వేయ‌టం.. క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలుగోళ్లంతా జేడీఎస్ కు ఓటు వేయాలంటూ ఓపెన్ ప్ర‌క‌ట‌న చేసిన దానిపై త‌న వివ‌ర‌ణ‌ను ఇవ్వాల‌న్న ఉద్దేశంతోనే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌గా చెబుతున్నారు.

ఛీ.. ఛీ.. వెగ‌టు వార్త‌లు.. వెగ‌టు వార్త‌లు. ఉత్త పుణ్యానికే గాలిని మూట‌లు క‌ట్టేస్తున్నారే? ప్ర‌ధానితో రాష్ట్రానికి సంబంధించి చ‌ర్చించాల్సిన అంశాలెన్నో ఉంటే.. వాటి గురించి సీరియ‌స్ గా చ‌ర్చించి.. రాష్ట్రానికి మేలు చేసేలా నిర్ణ‌యాలు తీసుకోవాలంటూ మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు పోతున్న పెద్ద మ‌నిషిని ప‌ట్టుకొని అన్నేసి మాట‌లు అంటారా? అస‌లు.. మీకు విలువ‌లు ఉండ‌వా? అంటూ తిట్ల పురాణం లంకించుకుందామ‌నుకున్నోళ్లు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్న మాట‌ల్ని న‌మ్మాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

లాజిక్ గా చూసిన‌ప్పుడు.. ఒక‌సారి త‌న‌కు అపాయింట్ మెంట్ ఇచ్చి నో అన్న త‌ర్వాత కొండంత‌ స్వాభిమానం ఉన్న కేసీఆర్ లాంటి అధినేత నెల తిర‌క్కుండానే ఢిల్లీ వెళుతున్నారంటే ఏదో మ‌త‌ల‌బు ఉండ‌దంటారా?