Begin typing your search above and press return to search.

గవర్నర్ సాబ్ కూడా స్పీకర్ దే ఫైనల్ అన్నారు

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:36 AM GMT
గవర్నర్ సాబ్ కూడా స్పీకర్ దే ఫైనల్ అన్నారు
X
రోజులు గడుస్తున్న కొద్దీ.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది. ఇప్పటివరకూ తలసాని రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్న తెలంగాణ విపక్షాలు.. ఇందుకోసం పలు వేదికల్ని ఆశ్రయించటం తెలిసిందే. అయితే.. ఎవరికి వారు తమ వైఖరిని స్పష్టం చేస్తుండటంతో.. తలసాని వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ స్పీకర్ మీద పడుతోంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. అనంతరం పార్టీ మారి.. అధికారపక్షంలో చేరటమే కాదు.. మంత్రిగా బాధ్యతలు చేపట్టటంతో ఆయనకు మంత్రి పదవి ఎలా ఇస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. తాను పార్టీ మారే సమయంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చేసినట్లు తలసాని చెప్పుకున్నారు. అయితే.. ఆయన రాజీనామా లేఖపై నిర్ణయం తీసుకోవాలంటూ విపక్షాలు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిపై ఒత్తిడి తెస్తున్నాయి.

నిర్ణయం తీసుకునే స్థానంలో ఉన్నా.. తనకున్న పరిమితులు స్పీకర్ కు తెలియనివి కావు. ఈ నేపథ్యంలో సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే అవకాశం ఉన్న తలసాని వ్యవహారాన్నివిపక్ష సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

పలు వాయిదాల అనంతరం ఈ మధ్యనే.. ఈ వ్యవహారం హైకోర్టు జోక్యం చేసుకోలేదని.. స్పీకర్ సముచిత నిర్ణయం తీసుకుంటారని.. త్వరలోనే ఆ అవకాశం ఉంటుందని తాము భావిస్తున్నట్లుగా హైకోర్టు పేర్కొంది. దీంతో.. మంత్రి తలసానిపై నిర్ణయం తీసుకోవాల్సిన బారం తెలంగాణ స్పీకర్ మీద పడింది. ఇక.. గవర్నర్ ఫిర్యాదు మీద ఇప్పటివరకూ నోరు విప్పని నరసింహన్ తాజాగా.. ఢిల్లీ పర్యటనలో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ.. మంత్రి తలసాని వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ దేనని తేల్చేశారు.

ఇలా ఎవరికి వారు.. తుది నిర్ణయం స్పీకర్ దే అని తేల్చేయటంతో ఇప్పటివరకూ ఈ విషయంపై నిర్ణయం కోసం పలు వేదికలను ఆశ్రయించిన స్థానే.. ఇప్పుడు అందరూ స్పీకర్ వంక చూసే పరిస్థితి. తలసాని వ్యవహారంపై నిర్ణయం తీసుకోవటంలో ఉన్న పరిమితుల నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ పై ఒత్తిడి మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు. మంత్రి తలసాని వ్యవహారంపై ఎవరికి వారు తేల్చేస్తుంటే.. స్పీకర్ మధుసూదనాచారి మాత్రం.. ఏమీ చెప్పలేని పరిస్థితి. ఈ వ్యవహారంపై భవిష్యత్తులో స్పీకర్ మాట పడే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకరకంగా.. స్పీకర్ మధుసూదనాచారికి మంత్రి తలసాని వ్యవహారం చిరాకు పుట్టించేదే.