Begin typing your search above and press return to search.

గవర్నర్ గారి దైవదర్శనానికి పైసా ఖర్చు కాలేదట

By:  Tupaki Desk   |   23 Oct 2016 5:39 AM GMT
గవర్నర్ గారి దైవదర్శనానికి పైసా ఖర్చు కాలేదట
X

రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేరు చెప్పినంతనే.. ఆయన దైవభక్తి.. పుణ్యక్షేత్రాల్లో తరచూ కనిపించే ఆయన చప్పున గుర్తుకు వస్తారు. అంగవస్త్రాన్ని కట్టుకొని.. గుళ్లల్లో చేసే ప్రదక్షిణలు.. ఆయన పుణ్య క్షేత్రాల యాత్రలు పెద్ద ఎత్తున చర్చకే తెర తీశాయి. ఇక.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు లాంటి వారైతే.. గవర్నర్ మీద ఓపెన్ గానే ఫైర్ అయ్యే పరిస్థితి.

ఆ మధ్యన ఒక ప్రముఖ మీడియా సంస్థ కొత్త సంవత్సరం రోజున.. నరసింహింన్ దైవ భక్తి..ఆ కారణంగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల మీద మొదటి పేజీలో ప్రముఖంగా ఒక వార్త అచ్చు వేయటంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నట్లు చెబుతారు. ఇలా గవర్నర్ నరసింహన్ దైవదర్శనాల వ్యవహారంపై జరిగిన చర్చ అంతాఇంతా కాదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ హేతువాద సంఘం ఆధ్యక్షులు వెంకటసుబ్బయ్య.. సమాచార హక్కు చట్టం కింద.. గవర్నర్ గారి దైవదర్శనాల కోసం ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేశారో చెప్పాలంటూ ఒక దరఖాస్తు చేశారు.

ఈ తరహా దరఖాస్తుకు రాజ్ భవన్ వర్గాలు ఎలాంటి సమాధానం చెబుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. గవర్నర్ గారి దైవదర్శనాలన్నీ అనుకోకుండా జరిగినవేనని.. కావాలని చేసినవి ఏమీ లేవని పేర్కొనటమే కాదు.. దైవదర్శనాల కోసం ప్రజాధనం పైసా ఖర్చు కాలేదని రాజ్ భ‌వ‌న్ స‌మాధానం ఇచ్చింది. గవర్నర్ తన అధికారిక హోదాలో ఒక్కటంటే ఒక్క గుడిని సందర్శించుకోలేదని.. కాబట్టి.. ప్రజాధనం ఖర్చు అయ్యే అవకాశం లేదని వెల్లడించింది. ఇదంతా బాగానే ఉన్నా.. ప్రతి రోజు కాకున్నా.. వారంలో ఎక్కువ రోజులు గవర్నర్ ఉండే రాజ్ భవన్ కు దగ్గర్లోని ఖైరతాబాద్ లో ఉన్న అంజనేయస్వామి గుడికి తరచూ అధికారిక కాన్వాయ్ లో వచ్చి.. పూజలు చేసుకుంటూ వెళతారు. మరి.. ఆ ఖర్చు ఏ ఖాతా కిందకు వస్తుందన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పేవారెవరు..?