గవర్నర్ మార్చేస్తారట...కొత్తవారెవరో?

Sat Jul 15 2017 12:41:36 GMT+0530 (IST)

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ పై కొత్త చర్చ మొదలైంది. కొద్దికాలం క్రితం వరకు ఆయన్ను ఉప రాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నారని వార్తలు రాగా తాజాగా ఆయన పదవీ మార్పు గురించి చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుత బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ కోవింద్ తన పదవికి రాజీనామా చేసిన రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైతే అక్కడా మరో గవర్నర్ ను నియమించాల్సి ఉంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. తెలుగువాడైన రోశయ్య బాధ్యతలు ముగిసిన తర్వాత అక్కడ ఎవరినీ నియమించలేదు. ఇంఛార్జిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంతో పాటుగా దీర్ఘకాలం పని చేస్తున్నందున నరసింహన్ కూడా మార్పు కోరినట్లు తెలిసింది.

2010 జనవరిలో నరసింహన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచీ ఆయనే కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం గవర్నర్ గా ఉన్న నరసింహన్ కు రెండు రాష్ట్రాలపై అవగాహన ఏర్పడింది. విభజన సమయంలో చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెరగకుండా సమర్థంగా వ్యవహరించారనే అభిప్రాయముంది. 2014 తెలంగాణ ఏర్పడిన సమయంలో ఆరాష్ట్రానికీ ఆయన్నే గవర్నర్ గా ఉంచారు. ఈ ఏడాది మే నాటికి ఆయనకు ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల వరకు ఆయన్నే కొనసాగిస్తున్నారు. నరసింహన్ ను మారిస్తే తెలంగాణకు - ఆంధ్రప్రదేశ్ కు వేర్వేరుగా గవర్నర్లను నియమించాల్సి ఉంటుంది. రాజకీయంగా కూడా దీనిపై కసరత్తు చేయాల్సిన నేపథ్యంలో కేంద్రం కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది.

దేశంలో తమిళనాడు - పశ్చిమబెంగాల్ - ఒరిశా - కేరళ - కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లనూ మార్చే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత గవర్నర్లు మార్పు - కొత్త నియమకాలు ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిగా ఎంతో అనుభవం ఉన్న నరసింహన్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని భద్రతా మండలికి సలహాదారునిగా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా  రాష్ట్రానికి గవర్నర్ గా రాకముందు నరసింహన్ చత్తీస్ గఢ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించి ఆ సమయంలో మావోయిస్టుల అణచివేత విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.