ట్విస్ట్ ఉంది...జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ - డిజీల్

Wed Jun 20 2018 23:01:12 GMT+0530 (IST)

పెద్ద ఎత్తున పెరిగిపోతున్న పెట్రోల్ - డీజిల్ ధరలను నియంత్రించే విషయంలో ఎదురుచూస్తున్న వారికి ఓ తీపికబురు. ధరలు తగ్గే విషయంలో  ప్రభుత్వం ముందున్న ఒకే ఒక మార్గం వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం. అయితే జీఎస్టీలోని అత్యధిక పన్ను శాతం అయిన 28 శాతం పరిధిలోకి తీసుకొచ్చినా కూడా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పరంగా తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. దీంతో దీనికి మరో పరిష్కారాన్ని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా జీఎస్టీతోపాటు రాష్ర్టాలు వ్యాట్ లేదా అమ్మకం పన్ను విధించుకునే అవకాశం కల్పించడం అని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు. జీఎస్టీ 28 శాతంతో పాటు రాష్ర్టాలు వ్యాట్ వేస్తే పన్నులు దాదాపు ఇప్పుడున్నట్లుగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఉండటం వల్ల కేంద్రం జేబుల్లోకి రూ.20 వేల కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ వెళ్తున్నది. జీఎస్టీ కిందికి తీసుకొస్తే ఆ మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ముందు దీనిపైనే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిజానికి ప్రపంచంలో ఎక్కడా పెట్రో ఉత్పత్తులపై కేవలం జీఎస్టీ మాత్రమే లేదని - అందుకే జీఎస్టీతోపాటు వ్యాట్ వేయాలని అనుకుంటున్నట్లు ఆ ప్రభుత్వ అధికారి తెలిపారు.

జీఎస్టీ కిందికి ఎప్పుడు తీసుకురావాలన్నది మాత్రం రాజకీయ నిర్ణయమని - అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకోవాల్సిందేనని ఆయన వెల్లడించారు. కేంద్రం ప్రస్తుతం పెట్రోల్ పై లీటర్ కు రూ.19.48 - డీజిల్ పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నది. వీటికి రాష్ర్టాలు అదనంగా వ్యాట్ లేదా అమ్మకపు పన్ను వేస్తున్నాయి. ముంబైలో అత్యధికంగా 39.12 శాతం.. అండమాన్ లో అత్యల్పంగా 6 శాతం వ్యాట్ వేస్తున్నారు.

దీంతో పెట్రోల్ పై మొత్తం పన్నులు 45 నుంచి 50 శాతం.. డీజిల్ పై 35 నుంచి 40 శాతం అవుతున్నది. ప్రస్తుతం పెట్రోల్ - డీజిల్‌పై కేంద్ర - రాష్ర్టాలు వేస్తున్న పన్నులు.. జీఎస్టీలో అత్యధికంగా ఉన్న 28 శాతం కన్నా కూడా ఎంతో ఎక్కువగా ఉంది. దీంతో కేవలం జీఎస్టీతోనే సరిపెడితే ప్రభుత్వాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయి. దీనికి పరిష్కారంగానే జీఎస్టీ - వ్యాట్ రెండూ వేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.