Begin typing your search above and press return to search.

ఇక‌పై జ‌న‌వ‌రి నుంచే ఆర్థిక సంవత్స‌రం?

By:  Tupaki Desk   |   21 July 2017 12:18 PM GMT
ఇక‌పై జ‌న‌వ‌రి నుంచే ఆర్థిక సంవత్స‌రం?
X
బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక అనేక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింది. ఈ ఏడాది బ‌డ్జెట్ ను మార్చిలో కాకుండా ఫిబ్ర‌వ‌రి 1న‌ ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో ఆర్థిక సంవత్స‌రంలో కూడా మార్పులు తెచ్చేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఇక‌పై జనవరి నుంచి డిసెంబర్ వ‌ర‌కు ఆర్థిక సంవ‌త్స‌రంగా ప‌రిగ‌ణించే ప్ర‌తిపాద‌నను కేంద్రం ప‌రిశీలిస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న‌పై సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు.

ఇక‌పై ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌ నుంచి మార్చి కాకుండా జనవరి నుంచి డిసెంబర్‌కు లెక్కగట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనను మాజీ ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారు శంక‌ర్ ఆచార్య ఆధ్వ‌ర్యంలోని క‌మిటీ ప‌రిశీలించింద‌ని జైట్లీ తెలిపారు. ఆ క‌మిటీ ఇచ్చిన నివేదిక త‌మ‌కు అందింద‌ని చెప్పారు. ఈ ప్ర‌కారం లోక్ స‌భ‌లో అడిగిన ఓ ప్ర‌శ్న‌కు జైట్లీ లిఖిత పూర్వ‌క స‌మాధాన‌మిచ్చారు.

ఈ అంశంపై ప్ర‌స్తుతం సంప్రదింపులు జరుపుతున్నామని, ఆర్థిక సంవత్సరం మార్పు అంశం పరిగణనలో ఉంది' అని ఆయన తెలిపారు.ఒక‌వేళ ఆర్థిక సంవత్సర షెడ్యూల్‌ మారిస్తే 2018 నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరిలో కాకుండా డిసెంబర్‌లో ప్రవేశ పెడతారా? లేదా నవంబర్‌లో ప్రవేశపెడతారా? అన్న‌ప్ర‌శ్న‌కు సమాధానం చెప్పేందుకు జైట్లీ నిరాకరించారు.

బీజేపీ హ‌యాంలోనే ఈ ఏడాది ప్ర‌త్యేక‌ రైల్వే బడ్జెట్‌ విధానానికి స్వస్థి పలికిన సంగ‌తి తెలిసిందే. రైల్వే బ‌డ్జెట్ ను కూడా సాధార‌ణ బడ్జెట్ లో క‌లిపేశారు. అలాగే, గతంలో చ‌లామ‌ణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. అదే త‌ర‌హాలో మరోసారి ఆర్థిక సంవత్సరంలో మార్పులు చేయాలని మోదీ స‌ర్కార్ యోచిస్తోంది.