ఇకపై పాస్ పోర్ట్ అలా పనికి రాదు

Fri Jan 12 2018 22:23:21 GMT+0530 (IST)

అడ్రస్ ప్రూఫ్ గా పాస్ పోర్ట్ ఇకపై పనికిరాదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్టుల జారీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్ పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపరచకుండా ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. అది అమలులోకి వస్తే గనుక పాస్ పోర్టులు ఇక అడ్రస్ ప్రూఫ్ లుగా పనికి రావు.విదేశాంగ శాఖ గోప్యంగా ఉంచుతున్నప్పటికీ...వివిధ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో పాస్ పోర్టు రూపురేఖలు మారనున్నాయి. దీంతో అది కేవలం విమాన ప్రయాణాలకు మాత్రమే పనికి రానుంది. సాధారణంగా పాస్ పోర్ట్ మూడు రంగుల్లో ఉంటుంది. ఒకటి వైట్ - రెండోది రెడ్ - మూడోది బ్లూ. వీటిల్లో తెల్లరంగులో ఉండే పాస్ పోర్ట్ కేవలం విదేశీ పర్యటనలు చేసే ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఉపయోగిస్తారు. రెడ్ పాస్ పోర్టు రాయబారులు వినియోగిస్తే మూడోదైన నీలిరంగు పాస్ పోర్టులు సాధారణ పౌరులు ఉపయోగిస్తారు. అయితే తాజాగా ఆరంజ్ కలర్ లో పాస్ పోర్టు తీసుకురానున్నట్టు సమాచారం. దీంతో పాటు పాస్ పోర్టు చివరిలో ఉండే ECR(emigration check)ను కూడా మారుస్తున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం పాస్ పోర్టు మొదటి పేజీలో ఫోటోతో కూడిన వివరాలు.. చివరి పేజీలో చిరునామా వివరాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇకనుంచి ఈసీఆర్ పేజీని ఇకపై ఖాళీగా ఉంచనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మార్పుల వల్ల పాస్ పోర్టును అడ్రస్ ప్రూఫ్ గా పరిగణించే అవకాశాలు పోనున్నాయి. ఈసీఆర్ ను తీసేయ్యడం వల్ల.. వ్యక్తుల పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉండదు.