Begin typing your search above and press return to search.

చెక్కుల ర‌ద్దు..చేయ‌బోమంటున్న కేంద్రం

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:35 PM GMT
చెక్కుల ర‌ద్దు..చేయ‌బోమంటున్న కేంద్రం
X
`చెక్ బుక్కులకు కాలం చెల్లిపోనుంది. దేశంలో డిజిటల్ లావాదేవీలకు ఊతమివ్వడంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు.` అని వెలువ‌డిన వార్త‌ల్లో నిజం లేద‌ని తేలిపోయింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా త్వరలో బ్యాంక్ చెక్ బుక్కులకు కేంద్రం గుడ్‌ బై చెప్పనుందని ఇటీవల అఖిల భారత వర్తకుల సమాఖ్య (సిఏఐటీ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దీంతో డిజిటల్ లావాదేవీలను మరింత బలోపేతం చేయడానికి చెక్కులకూ చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంద‌ని వార్త‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగాయి. అయితే దీనిపై కేంద్ర క్లారిటీ ఇచ్చింది. చెక్కు బుక్కుల‌కు చెల్లు చీటి లేద‌ని స్ప‌ష్టం చేసింది.

చెక్‌ బుక్‌ లను ఉపసంహరిస్తారన్న వార్తలు జోరుగా ప్ర‌చారంలో ఉన్న‌ప్ప‌టికీ...అలాంటి ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌త్యేక ట్వీట్‌ చేసింది. డిజిట‌ల్ లావాదేవీల‌కు చెక్ బుక్‌ ల‌కు మంగ‌ళం పాడ‌టానికి సంబంధం లేద‌ని తెలిపింది. కాగా, నల్లధనం - నకిలీ కరెన్సీల నిర్మూలనకు నగదు రహిత భారతమే చక్కని పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ బలంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500 - 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకూ శ్రీకారం చుట్టారు. దీంతో క్రమేణా కార్డు లావాదేవీలు పెరుగగా - నగదుకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.

మ‌రోవైపు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాపార లావాదేవీల్లో చెక్కుల ద్వారా జరిగేవే ఎక్కువ. ప్రస్తుత లావాదేవీల్లో 95 శాతం నగదు - చెక్కుల ద్వారానే జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు పడిపోయిన నేపథ్యంలో చెక్కుల వినియోగం పెరిగిందని అంటున్నారు. దీంతో చెక్ బుక్కుల నిషేధం ప్రభావం అధికంగానే ఉంటుందన్న అభిప్రాయాలు విస్తృతంగా వినిపించాయి. చిన్న - మధ్యతరహా వ్యాపార సంస్థల (ఎస్‌ ఎంఈ) చెల్లింపుల్లో చెక్కులదే అధిక వాటా. వస్తువుల డెలివరీ - సరఫరాలు.. చిరువ్యాపారులు - కస్టమర్లిచ్చే చెక్కులపైనే ఆధారపడి ఉంటాయి. కావాల్సిన తేదీకి చెల్లుబాటు అయ్యే వెసులుబాటు చెక్కుల్లో ఉండటంతో నూతన లావాదేవీల్లో వీటినే ఎక్కువగా వాడుతున్నారు. సరుకు అందనిపక్షంలో చెక్కులను నిలుపుదల చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలోనూ చెక్కులకు డిమాండ్ ఎక్కువే. భూములు - ఇండ్ల క్రయవిక్రయాల్లో అధికులు చెక్కులకే ప్రాధాన్యతనిస్తున్నారు. చాలామంది అద్దెలనూ చెక్కుల ద్వారానే తీసుకుంటున్నారు. పెద్ద నోట్లు రద్దయిన దగ్గర్నుంచి భీమ్ వంటి ఎన్నో పేమెంట్ యాప్‌లు వచ్చినా.. చెక్కులకు మాత్రం ఆదరణ తగ్గలేదు.