Begin typing your search above and press return to search.

పనిపక్కనపెట్టి మహిళా ఉద్యోగుల ‘టిక్ టాక్’?

By:  Tupaki Desk   |   15 July 2019 2:11 PM GMT
పనిపక్కనపెట్టి మహిళా ఉద్యోగుల ‘టిక్ టాక్’?
X
వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు.. సమస్యలపై వచ్చే ప్రజల నుంచి విజ్ఞప్తులు విని పరిష్కరించాల్సిన బాధ్యత వారిది. కానీ అవన్నీ పక్కనపెట్టేసి టిక్ టాక్ మాయలో పడి వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి.. వారి వీడియోల పిచ్చి బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరుకుంది. కొందరు ఈ వీడియోలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాహసంగా వీడియోలు చేసి మృత్యువాత పడుతున్నారు. ఇక వీడియోల మోజులో పనులన్నీ పక్కనపెట్టి స్మార్ట్ ఫోన్లకే అంకితమవుతున్నారు కొందరు మహిళలు..

తాజాగా ఖమ్మం కార్పొరేషన్ మహిళా ఉద్యోగిణుల టిక్ టాక్ వీడియోలు వైరల్ గా మారాయి. వారి వీడియోలు ఆన్ లైన్ కనిపించడంతో ఉద్యోగుల తీరుపై గత కమిషనర్ నోటీసులు కూడా ఇచ్చారని తెలిసింది. అయినా వాళ్లు వరుసగా టిక్ టాక్ వీడియోలు అదీ ఆఫీసులోనే పెడుతుండడం తీవ్ర వివాదాస్పదమైంది.

ఇక బర్త్ సర్టిఫికెట్లు- రోడ్లు- ఇంటి పర్మిషన్లు- శానిటేషన్ సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ కు పెద్ద ఎత్తున వస్తున్న ప్రజలను కలవకుండా బిజీగా ఉన్నామని సదురు మహిళా ఉద్యోగిణులు చెబుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ పనులు చేయకుండా వీడియోలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. డ్యూటీ టైంలో టిక్ టాక్ వీడియోలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇలా ఖమ్మం కార్పొరేషన్ లోని మహిళా ప్రభుత్వ అధికారుల టిక్ టాక్ వీడియోల తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.