గొట్టిపాటి రవికుమార్ తో సహా ఆరు మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు..వైసీపీ వైపు చూపు!

Thu Feb 14 2019 15:55:44 GMT+0530 (IST)

గత నాలుగున్నరేళ్లలో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆరు మంది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారని సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలే వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు  వైసీపీ వైపు వచ్చేశారు. తాజాగా అవంతి శ్రీనివాస్ రూపంలో మరో ఎంపీ అదే రూట్లో ఉన్నాడు. ఇంకా మరి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు - ఎంపీలు కూడా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలిచే అవకాశం లేదనే భావన చాలా మందిని ఇటు వైపు వచ్చేలా చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇరవై మూడు మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో .. ఆరు మంది ఎమ్మెల్యేలు వైసీపీతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా సమాచారం.

ఈ జాబితాలో ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్ పేరు ముందు ఉంది. జగన్ కు సన్నిహితంగా మెలిగిన గొట్టిపాటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లు భరించలేక ఆ పార్టీలోకి వెళ్లాడప్పుడు. ఇప్పుడు ఈయన వైసీపీలోకి తిరిగి రావడానికి చూస్తున్నాడట. ఆయనే కాకుండా మొత్తం ఆరు మంది ఫిరాయింపుదారులు వైసీపీలోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా సమాచారం.

ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంప్రదింపులు  జరుపుతున్నారని సమాచారం! త్వరలోనే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.