Begin typing your search above and press return to search.

గోరంట్ల మాధవ్ వ్యవహారం.. జగన్ ప్లాన్ బీ

By:  Tupaki Desk   |   23 March 2019 12:08 PM GMT
గోరంట్ల మాధవ్ వ్యవహారం.. జగన్ ప్లాన్ బీ
X
గోరంట్ల మాధవ్.. ఇప్పుడీ పోలీస్ అధికారి చుట్టూ టీడీపీ కుట్రలు అల్లి వైసీపీ అభ్యర్థిగా పోటీచేయకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. అనంతపురం ఎంపీ జేసీ ఆగడాలపై మీసం మేలేసి తొడగొట్టి వార్తల్లో నిలిచిన గోరంట్ల మాధవ్.. అనంతరం టీడీపీ ప్రభుత్వం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో డిసెంబర్ లోనే తన పోలీస్ ఉద్యోగానికి స్వచ్చంద రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

అయితే ఇక్కడే టీడీపీ ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. ఈయన వీఆర్ఎస్ ను ఇప్పటివరకూ టీడీపీ ప్రభుత్వం ఆమోదించలేదు. ట్రిబ్యునల్ కు వెళ్లితే వెంటనే ఆమోదించాలని ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి. అయినా టీడీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈసీని ఆశ్రయించినా ఫలితం లేదు. ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేయకుండా ఎన్నికల్లో పోటీచేయడానికి గోరంట్ల మాధవ్ కు అర్హత ఉండదు. దీంతో ఇప్పుడు వైసీపీ పునరాలోచనలో పడింది. అనంతపురం టికెట్ పొందిన మాధవ్ భవితవ్యం అగమ్య గోచరంగా తయారైంది. టీడీపీ కుట్రలకు మాధవ్ భవిష్యత్ అంధకారంగా మారిపోయింది.

మాధవ్ వీఆర్ఎస్ ఆమోదం పొందకపోతే నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో హిందూపురం ఎంపీ టికెట్ ను ఆయన భార్యకు ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు జగన్ ను కలిసిన మాధవ్ తో ఇదే విషయంపై చర్చించారు. మాధవ్ సతీమణీ సునీతను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీఫాం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. దీంతో హిందూపురం బరిలో వైసీపీ తరుఫున మాధవ్ భార్య పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.

హిందూపురంలో సామాజిక సమీకరణాలు గోరంట్ల మాధవ్ కు కలిసివస్తున్నాయి. జిల్లాలో కురుభ వర్గం వారు గెలిపించే స్థాయిలో ఉన్నారు. అదే సామాజికవర్గమైన మాధవ్ ను టీడీపీ వేధిస్తోంది. చంద్రబాబు కుప్పంలోనూ కురుభ సామాజికవర్గం వారు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే మాధవ్ కు జరిగిన అన్యాయంపై పోరాడి హిందూపురంలో మాధవ్ ను గెలిపించాలని జగన్ భావిస్తున్నారు. ఇదే మాధవ్ కు సానుభూతి ఓట్లుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. మొత్తం మీద టీడీపీ నేతలపైనే తొడగొట్టిన పోలీస్ అధికారి హిందూపురం ఎంపీ సీటు కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ గా కూడా టీడీపీ వేధింపులతో గోరంట్ల మాధవ్ ప్రజల్లో హీరోగా మారి గెలుపు ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.