Begin typing your search above and press return to search.

ఇన్ స్టంట్ సెర్చ్ ఫీచ‌ర్ నిలిపేసిన గూగుల్‌!

By:  Tupaki Desk   |   27 July 2017 4:43 PM GMT
ఇన్ స్టంట్ సెర్చ్ ఫీచ‌ర్ నిలిపేసిన గూగుల్‌!
X
గ‌తంలో ఏద‌న్నా స‌మాచారం కావాలంటే నానా తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చేది. గూగుల్ సెర్చింజ‌న్ వ‌చ్చేశాక ఎటువంటి స‌మాచార‌మైనా చిటికెలో తెలిసిపోతోంది. చింత‌పండు నుంచి చంద్ర మండ‌లం వ‌ర‌కు అన్ని రకాల విష‌యాల గురించి గూగుల్ త‌ల్లి ఠ‌పీ మ‌ని చెప్పేస్తుంది. ప్ర‌స్తుతం గూగుల్ సెర్చ్ లేని ప్ర‌పంచాన్ని ఊహించ‌డం క‌ష్ట‌మంటే అతిశ‌యోక్తి కాదు. అంతగా ఈ దిగ్గ‌జ సెర్చింజన్ ప్ర‌జ‌ల జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తోంది. అయితే, గూగుల్‌ తాజాగా ఇన్‌ స్టంట్‌ సెర్చ్‌ ఫీచర్‌ ను తొలగించాలని నిర్ణయించింది. దీన్ని వినియోగిస్తున్న వారిలో డెస్క్‌టాప్‌ కంటే మొబైల్‌ వినియోగదారులే అధికంగా ఉండటంతో ఈ ఫీచర్‌ ను నిలిపివేయాలని సంస్థ భావిస్తోంది.

మనకు కావాల్సిన స‌మాచారానికి సంబంధించిన అక్ష‌రాలు - ప‌దాలను బ‌ట్టి కొన్ని ఫలితాలను అందించడమే ఈ ఫీచర్‌ ప్రత్యేకత. వేగంగా టైప్‌ చేయలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని సంస్థ భావించింది. దీంతో పాటు యూజ‌ర్ల విలువైన సమయాన్నికాపాడాల‌న్న‌ది గూగుల్‌ ఆలోచన. అయితే, గూగుల్ ఇన్ స్టంట్ సెర్చింజన్‌ ట్రాఫిక్‌... డెస్క్‌టాప్‌ కంటే మొబైల్స్‌ ద్వారానే దాదాపు 60 శాతం నమోదవుతోందట. దీంతో, ఈ ఆప్ష‌న్ ను నిలిపివేయాల‌ని గూగుల్ భావిస్తోంది.

ప్ర‌స్తుతం ఉన్న‌ గూగుల్‌ ఇన్‌ స్టంట్‌ సెర్చింజన్‌ ఫీచర్ కు బ‌దులుగా ఆటోకంప్లీట్‌ ఫీచర్ ను గూగుల్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. యూజ‌ర్లు గతంలో సెర్చ్ చేసిన‌ పదాలు వాటికి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నప‌దాల‌ను జోడించి సెర్చ్ రిజ‌ల్ట్స్ ను గూగుల్ అందిస్తుంది. యూజ‌ర్లు ఈ ఆప్ష‌న్ వాడుతున్న ప్రాంతం, బుక్‌మార్క్స్ వంటి వాటిపై ఈ ఫీచ‌ర్ ఆధారపడి ఉంటుంది. మరింత వేగంగా అన్ని డివైజ్ ల‌లో సెర్చ్‌ చేసుకోవడంపై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు గూగుల్ ప్ర‌తినిధి ఒకరు పేర్కొన్నారు.