గూగుల్ జాబ్ కు గుడ్ బై చెప్పేస్తూ నిరసన!

Wed May 16 2018 17:22:59 GMT+0530 (IST)

కళ్లు చెదిరే జీతం..అంతకు మించిన వర్కింగ్ ఎన్విరానమెంట్ గూగుల్ సొంతంగా చెబుతారు. ఆ కంపెనీలో జాబ్ రావటం అంటే.. జీవితంలో ఏదో సాధించినట్లేనని ఫీలయ్యే వారు చాలామంది ఉంటారు. గూగుల్ లో జాబ్ తమ జీవిత ధ్యేయంగా చెప్పేవారెందరో. ఎందుకిలా ఉంటే..  ప్రపంచంలో ఉద్యోగులకు అత్యంత అనువుగా నిలిచే టాప్ ఫైవ్ కంపెనీల్లో గూగుల్ ఒకటి. అందుకే.. ఆ కంపెనీలో జాబ్ అంటే చాలు.. రెఢీ అనేస్తుంటారు.మరి.. అలాంటి కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత.. కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏమాత్రం సరికాదంటూ జాబ్‌కు రిజైన్ చేయటాన్ని ఊహించలేని పరిస్థితి. కానీ.. ఆ సాహసానికి రెఢీ అవుతున్నారు పలువురు ఉద్యోగులు. జీవితం సెటిల్ అయిపోయే అవకాశం ఉన్నా.. విలువల విషయంలో మాత్రం తాము రాజీ పడేందుకు  సిద్ధంగా లేమంటూ భారీ సాహసానికి తెర తీశారు కొందరు ఉద్యోగులు.

తాజాగా గూగుల్ ఒక ప్రాజెక్టును చేపట్టింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలకు సైతం రిజైన్ చేసేందుకు రెఢీ అవుతున్నారు. అమెరికా రక్షణ విభాగం డ్రోన్ టెక్నాలజీకి సంబందించి ప్రాజెక్టు మావేన్ అనే కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు చేసే పని ఏమిటంటే.. డ్రోన్ లు ఆకాశంలో తిరుగుతూ భూమి మీద ఫోటోలు తీయటం. ఆ తర్వాత ఆ ఫోటోల్లోని మనుషులను.. వస్తువులను వేర్వేరుగా చేసి చూపించటం. అందుకు అవసరమైన ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ ను అందించేందుకు మూడు నెలల క్రితం అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ గూగుల్ కంపెనీతో డీల్ ఓకే చేసుకుంది. అయితే.. ఈ ప్రాజెక్టుపై గూగుల్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మనిషి కంటే యంత్రానికి ఎక్కువ శక్తిని ఇవ్వటం సరికాదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సైన్యానికి సంబంధించిన ఇష్యూల్లో పాలు పంచుకోవటం వల్ల కంపెనీ మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తమ ఆవేదనన తెలియజేస్తూ.. తమ నిరసనలో భాగంగా జాబ్ లకు రిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురుతమ జాబ్స్ కు రిజైన్ చేయగా.. మరో నాలుగు వేల మంది గూగుల్ ఉద్యోగులు కూడా కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తక్షణమే ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఉద్యోగుల వాదనను గూగుల్ లైట్ తీసుకుంటోంది. ఓపక్క ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ జాబ్స్ రిజైన్ చేస్తుంటే.. మరోవైపు వాటిని పట్టించుకోకుండా తాజాగా పెంటగాన్ కంపెనీ  క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిపెన్స్ ప్రాజెక్టును చేజిక్కించుకునేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.